అమిత్ షాపై కేసును ఉపసంహరించుకున్న హైదరాబాద్ పాతబస్తీ పోలీసులు

  • ఎన్నికల సమయంలో కోడ్ ఉల్లంఘించారంటూ అమిత్ షా, కిషన్ రెడ్డి సహా పలువురిపై కేసు
  • పాతబస్తీలోని మొఘల్‌పురా పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు
  • ఉద్దేశపూర్వకంగా కోడ్ ఉల్లంఘన జరగలేదని తాజాగా ఉపసంహరణ
కేంద్రమంత్రులు అమిత్ షా, కిషన్ రెడ్డిలపై మొఘల్‌పురా పోలీస్ స్టేషన్‌లో దాఖలైన కేసును పోలీసులు ఉపసంహరించుకున్నారు. లోక్ సభ ఎన్నికల సమయంలో అమిత్ షా, కిషన్ రెడ్డి పాతబస్తీలో ప్రచారం నిర్వహించారు. కోడ్ ఉల్లంఘించారంటూ పోలీసులు అప్పట్లో వారిపై కేసు నమోదు చేశారు. అయితే ఉద్దేశపూర్వకంగా కోడ్ ఉల్లంఘన జరగలేదని అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

మే 1వ తేదీన పాతబస్తీలో హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలతకు మద్దతుగా అమిత్ షా ప్రచారం నిర్వహించారు. సభలో మాధవీలత మాట్లాడుతుండగా.. వేదికపైకి ఇద్దరు బాలికలు వచ్చారు. అమిత్ షా ఆ చిన్నారులను తన వద్దకు రమ్మంటూ సైగ చేయడంతో.. ఆ చిన్నారులు ఆయన వద్దకు వెళ్లారు. ఓ చిన్నారి చేతిలో ఉన్న బ్యానర్‌పై కమలం పువ్వు గుర్తు.. మరో ఇద్దరు చిన్నారుల చేతిలో ఆప్ కీ బార్ 400 సీట్లు అనే ప్లకార్డ్స్ ఉన్నాయి.

ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇది ఎన్నికల నిబంధనల ఉల్లంఘన కిందకు వస్తుందంటూ, బీజేపీ నేతలపై కాంగ్రెస్ పార్టీ నేత జి. నిరంజన్ ఈసీకి ఫిర్యాదు చేశారు. ఫిర్యాదును పరిశీలించిన ఈసీ... విచారణ జరపాలని పోలీస్ కమిషనర్‌ను ఆదేశించింది. దీంతో, మొఘల్‌పుర పోలీస్ స్టేషన్‌లో సెక్షన్ 188 ఐపీసీ క్రింద కేసు నమోదు చేసిన పోలీసులు... ఏ1గా యమన్ సింగ్, ఏ2గా మాధవీలత, ఏ3గా అమిత్ షా, ఏ4గా కిషన్ రెడ్డి, ఏ5గా రాజాసింగ్‌తో పాటు పలువురిపై కేసు నమోదు చేశారు.


More Telugu News