సూర్యకుమార్ యాదవ్ క్యాచ్ వివాదం.. వెలుగులోకి కొత్త వీడియో!

  • టీ20 ప్రపంచకప్ ఫైనల్‌లో సూర్యకుమార్ పట్టిన క్యాచ్‌పై దుమారం
  • సూర్య కాలు బౌండరీలైన్‌ను తాకిందంటూ వీడియోలు
  • తాజాగా మరో కోణంలోని వీడియో వెలుగులోకి
  • ఫెయిర్‌గానే క్యాచ్.. వివాదానికి ఇక ఫుల్‌స్టాప్
దక్షిణాఫ్రికాతో జరిగిన టీ20 ప్రపంచకప్‌ ఫైనల్‌లో తీవ్ర వివాదాస్పదమైన సూర్యకుమార్ యాదవ్ క్యాచ్‌కు సంబంధించి తాజాగా సరికొత్త యాంగిల్‌కు సంబంధించిన వీడియో వెలుగులోకి వచ్చింది. క్యాచ్ సందర్భంగా సూర్యకుమార్ కాలు బౌండరీకి తగిలిందని, అది అసలు అవుటే కాదని చాలామంది వాదించారు. రీప్లేల్లోనూ సూర్య కాలు బౌండరీలైన్‌కు తాకినట్టు అస్పష్టంగా కనిపించింది. సూర్య ఆ క్యాచ్ పట్టే సమయానికి సౌతాఫ్రికా విజయానికి చివరి ఓవర్‌లో 16 పరుగులు అవసరం. డేవిడ్ మిల్లర్ స్ట్రైక్‌లో ఉండడంతో విజయం ఖాయమనే అనుకున్నారంతా.

కానీ, హార్దిక్ పాండ్యా వేసిన పుల్‌టాస్‌ను బలంగా బాదిన మిల్లర్ బౌండరీ వద్ద సూర్యకుమార్‌కు దొరికిపోయాడు. ఈ క్యాచ్‌కు సంబంధించి పలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే, తాజాగా వెలుగులోకి వచ్చిన వీడియో అది ఫెయిర్ క్యాచేనని, అందులో ఎలాంటి వివాదం లేదని తేల్చేసింది. ఈ వీడియో సూర్యకుమార్ కాలు బౌండరీ లై‌న్‌కు కొద్ది దూరంలో ఉండడం స్పష్టంగా కనిపించింది. మరి ఈ వీడియోతోనైనా వివాదానికి ఫుల్‌స్టాప్ పడుతుందేమో చూడాలి.


More Telugu News