ఇది శుభపరిణామం.. చంద్రబాబు, రేవంత్ రెడ్డిల సమావేశంపై బీజేపీ ఎంపీ లక్ష్మణ్!

  • ఈ సాయంత్రం భేటీ అవుతున్న చంద్రబాబు, రేవంత్ రెడ్డి
  • విభజన సమస్యలను పరిష్కరించుకోవాలని లక్ష్మణ్ సూచన  
  • తిరుమల పవిత్రతను కాపాడాలని చంద్రబాబుకు లేఖ రాస్తానన్న లక్ష్మణ్
రాష్ట్ర విభజన సమస్యలను పరిష్కరించుకునే లక్ష్యంతో ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులు చంద్రబాబు, రేవంత్ రెడ్డి ఈ సాయంత్రం భేటీ అవుతున్న సంగతి తెలిసిందే. హైదరాబాద్ లోని ప్రజాభవన్ లో జరగనున్న ఈ సమావేశం ఇరు రాష్ట్రాల మధ్య ఉన్న విభజన సమస్యలకు పరిష్కారం చూపుతుందనే ఆశాభావంతో అందరూ ఉన్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ సీనియర్ నేత, ఎంపీ లక్ష్మణ్ ఇరువురు ముఖ్యమంత్రులకు కీలక సూచన చేశారు. రాష్ట్ర విభజన సమస్యలను పరిష్కరించుకునే దిశగా ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అడుగు వేయడం శుభపరిణామమని ఆయన అన్నారు. విభజన సమస్యలను ఇద్దరు సీఎంలు పరిష్కరించుకోవాలని కోరారు. ఈ రోజు హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ మేరకు వ్యాఖ్యానించారు. 

ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం తిరుమల పవిత్రతను కాపాడాలని కోరుతూ ఏపీ సీఎం చంద్రబాబుకు లేఖ రాస్తానని లక్ష్మణ్ తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో తిరుమలలో అవినీతి, అక్రమాలు జరిగాయని... వీటిపై విచారణ జరిపించాలని ఆయన అన్నారు. 

గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడిందని లక్ష్మణ్ మండిపడ్డారు. ముస్లిం సామాజికవర్గానికి బీజేపీ వ్యతిరేకమంటూ తప్పుడు ప్రచారం చేసిందని విమర్శించారు. కేవలం మతపరమైన రిజర్వేషన్లను మాత్రమే బీజేపీ వ్యతిరేకించిందని... కానీ, రాజ్యాంగాన్ని బీజేపీ మారుస్తుందని, రిజర్వేషన్లను రద్దు చేస్తుందంటూ కాంగ్రెస్ విష ప్రచారం చేసిందని దుయ్యబట్టారు. తప్పుడు ప్రచారం చేసి, ఎన్నికల్లో కాంగ్రెస్ లబ్ధి పొందిందని అన్నారు. మహిళలకు 33 శాతం రిజర్వేషన్లను ఎన్డీయే ప్రభుత్వం కల్పించిందని చెప్పారు. ఆర్టికల్ 370ని రద్దు చేసి, జమ్మూకశ్మీర్ ప్రజలకు రిజర్వేషన్లు కల్పించిన ఘనత ప్రధాని మోదీదని కితాబునిచ్చారు. రెండు తెలుగు రాష్ట్రాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు.


More Telugu News