ఎస్ఎస్‌ రాజ‌మౌళిపై డాక్యుమెంటరీ.. స్ట్రీమింగ్ ఎక్క‌డ‌, ఎప్పుడంటే..!

  • 'మోడరన్ మాస్టర్స్: ఎస్ఎస్‌ రాజమౌళి' పేరిట డాక్యుమెంటరీ
  • ఆగ‌ష్టు 02 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ 
  • డాక్యుమెంట‌రీ కోసం ఆత్రుత‌గా ఎదురుచూస్తున్న జ‌క్క‌న్న ఫ్యాన్స్‌
టాలీవుడ్ లెజెండ‌రీ డైరెక్ట‌ర్‌ ఎస్ఎస్ రాజ‌మౌళి జీవితంపై ప్ర‌ముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ నెట్‌ఫ్లిక్స్ డాక్యుమెంటరీ తీసింది. 'మోడరన్ మాస్టర్స్: ఎస్ఎస్‌ రాజమౌళి' పేరుతో ఈ డాక్యుమెంటరీ రూపొందగా .. దీన్ని ఆగ‌ష్టు 02 నుంచి స్ట్రీమింగ్ చేయ‌నున్న‌ట్లు 'ఎక్స్' (ట్విట్ట‌ర్‌) వేదిక‌గా ప్ర‌క‌టించింది.

"ఒక మనిషి. అనేక బ్లాక్ బస్టర్లు. అంతులేని ఆశయం. ఈ లెజెండరీ ఫిల్మ్ మేకర్ ఇలా అత్యున్న‌త‌ శిఖరాల‌కు చేరుకోవడానికి అనుస‌రించింది ఏమిటి? మోడరన్ మాస్టర్స్: ఎస్ఎస్‌ రాజమౌళి, ఆగస్ట్ 2న వస్తున్నారు, నెట్‌ఫ్లిక్స్‌లో మాత్రమే!" అంటూ ట్వీట్ చేసింది. దీంతో జ‌క్క‌న్న ఫ్యాన్స్‌తో పాటు సినీ అభిమానులు కూడా ఈ డాక్యుమెంట‌రీ కోసం ఆత్రుత‌గా ఎదురుచూస్తున్నారు. 

ఇక ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. తెలుగు సినిమాను అంత‌ర్జాతీయ‌ స్థాయికి తీసుకెళ్లిన లెజెండ‌రీ డైరెక్ట‌ర్‌. త‌న‌దైన మేకింగ్‌తో సినిమాల‌ను గ్రాండ్‌గా తీయ‌డంలో ఆయ‌న‌కు ఆయ‌నే సాటి. జ‌క్క‌న్న తీసిన 'బాహుబ‌లి', 'బాహుబ‌లి-2', 'ఆర్ఆర్ఆర్' చిత్రాలు భారీ వ‌సూళ్ల‌తో పాటు తెలుగు సినిమాను ప్ర‌పంచ వేదిక‌పై నిల‌బెట్టాయి. ఇక 'ఆర్ఆర్ఆర్' అయితే ఆస్కార్ సాధించిన తొలి తెలుగు చిత్రంగా రికార్డుకెక్కింది.


More Telugu News