ఆగ్రా ఎయిర్‌ఫోర్స్ స్టేషన్‌లో అగ్నివీరుడి ఆత్మహత్య!

  • ఉత్తర్‌ప్రదేశ్‌లో వెలుగు చూసిన ఘటన 
  • సెంట్రీ విధులు నిర్వర్తిస్తూ మంగళవారం ఆత్మహత్య
  • సెలవులు దొరక్క బలవన్మరణానికి పాల్పడి ఉండొచ్చంటూ వార్తా కథనాలు
ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఆగ్రా ఎయిర్‌ఫోర్స్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న అగ్నివీర్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మంగళవారం రాత్రి సెంట్రీ విధులు నిర్వహిస్తున్న సమయంలో అతడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. మృతుడిని శ్రీకాంత్ కుమార్ చౌదరిగా గుర్తించారు. 2022లో అతడు అగ్నివీరుడిగా భారత ఎయిర్‌ఫోర్స్‌లో చేరాడు. 

శ్రీకాంత్ మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించామని ఐఏఎఫ్ అధికారులు తెలిపారు. బీహార్ యూనిట్‌కు చెందిన ఎయిర్‌ఫోర్స్ సిబ్బంది గౌరవ వందనంతో అంత్యక్రియలు నిర్వహించినట్టు పేర్కొన్నారు. శ్రీకాంత్ స్వస్థలమైన నారాయణపూర్ గ్రామంలో అంత్యక్రియలు జరిగినట్టు పేర్కొన్నారు. అయితే, ఆగ్రా ఎయిర్‌ఫోర్స్ స్టేషన్‌లో సిబ్బంది కొరత కారణంగా సెలవులు లభించక ఒత్తిడికిలోనై శ్రీకాంత్ ఆత్మహత్య చేసుకున్నట్టు వార్తా కథనాలు వెలువడుతున్నాయి. 

శ్రీకాంత్ వద్ద ఎటువంటి సూసైడ్ నోట్ లభ్యం కాలేదని షాహ్‌గంజ్ పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్ఓ తెలిపారు. అతడి కుటుంబసభ్యులు ఎవరూ ఫిర్యాదు కూడా చేయలేదన్నారు. వారు రాతపూర్వకంగా ఫిర్యాదు చేస్తే దర్యాప్తు ప్రారంభిస్తామని తెలిపారు.


More Telugu News