వరల్డ్ కప్ గెలిచిన టీమిండియాకు రూ.11 కోట్ల నజరానా ప్రకటించిన మహారాష్ట్ర సీఎం షిండే

వరల్డ్ కప్ గెలిచిన టీమిండియాకు రూ.11 కోట్ల నజరానా ప్రకటించిన మహారాష్ట్ర సీఎం షిండే
  • నేడు మహారాష్ట్ర విధాన్ భవన్ లో టీమిండియా ఆటగాళ్లకు సన్మానం
  • హాజరైన రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, యశస్వి జైస్వాల్, శివమ్ దూబే
  • ఆటగాళ్లను ప్రశంసల్లో ముంచెత్తిన సీఎం షిండే
అమెరికా, వెస్టిండీస్ సంయుక్తంగా నిర్వహించిన టీ20 వరల్డ్ కప్ టోర్నీలో విజేతగా నిలిచి స్వదేశానికి తిరిగొచ్చిన టీమిండియాపై ప్రశంసల వర్షం కురుస్తోంది. తాజాగా, వరల్డ్ కప్ గెలిచిన టీమిండియా జట్టుకు మహారాష్ట్ర  ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే రూ.11 కోట్ల నజరానా ప్రకటించారు. 

ఇవాళ ముంబయిలోని మహారాష్ట్ర విధాన్ భవన్ లో టీమిండియా ఆటగాళ్లు రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, యశస్వి జైస్వాల్, శివమ్ దూబేలను మహారాష్ట్ర ప్రభుత్వం ఘనంగా సత్కరించింది. ఈ కార్యక్రమంలోనే సీఎం ఏక్ నాథ్ షిండే టీమిండియాకు నజరానా ప్రకటించారు.

కాగా, తన ప్రసంగంలో షిండే మాట్లాడుతూ, చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ ను వరల్డ్ కప్ లో టీమిండియా ఓడించడం తనకెంతో సంతోషం కలిగించిందని అన్నారు. దక్షిణాఫ్రికాతో ఫైనల్లో సూర్యకుమార్ యాదవ్ బౌండరీ లైన్ వద్ద పట్టిన అద్భుత క్యాచ్ గురించి ప్రస్తావించారు. 

అంతేకాదు, మహారాష్ట్ర క్రికెట్ కు చెందిన పరాస్ మాంబ్రే, అరుణ్ కనాడే టీమిండియా సహాయక సిబ్బందిగా తమ పాత్రను విజయవంతంగా నిర్వర్తించారని సీఎం షిండే అభినందించారు. 

గతరాత్రి ముంబయి మెరైన్ డ్రైవ్ లో లక్షలాది మంది హాజరైన టీమిండియా విక్టరీ పరేడ్ లో ఎలాంటి అపశ్రుతులు జరగకుండా సమర్థవంతంగా ఏర్పాట్లు చేశారంటూ పోలీసులను కూడా అభినందించారు.


More Telugu News