బ్రిటన్ ఎన్నికల్లో గెలిచిన భారత సంతతి నేతలు వీరే!

యావత్ ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బ్రిటన్ సార్వత్రిక ఎన్నికలు ముగిశాయి. కీర్ స్టార్మర్ నాయకత్వంలోని లేబర్ పార్టీ అద్భుత విజయం సాధించింది. బ్రిటన్ పార్లమెంటులో మొత్తం సీట్ల సంఖ్య 650 కాగా.... ఇప్పటివరకు 644 స్థానాల్లో ఫలితాలు తేలాయి. లేబర్ పార్టీ 409 స్థానాలతో తిరుగులేని విజయం అందుకుంది. 

ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 326 కాగా... లేబర్ పార్టీ 400కి పైగా సీట్లతో ప్రభుత్వం ఏర్పాటుకు సిద్ధమైంది. రిషి సునాక్ నాయకత్వంలోని కన్జర్వేటివ్ పార్టీ 119 స్థానాలు నెగ్గింది. ఓవరాల్ గా... 330 మంది తొలిసారిగా ఎంపీలయ్యారు. 

ఇక అసలు విషయానికొస్తే... బ్రిటన్ సార్వత్రిక ఎన్నికల్లో పలువురు భారత సంతతికి చెందిన నేతలు విజయం సాధించారు. వారిలో రిషి సునాక్ కూడా ఉన్నారు. రిషి సునాక్ ఎంపీగా గెలిచినప్పటికీ, తన కన్జర్వేటివ్ పార్టీ ఓడిపోవడంతో ఆయన ప్రధాని పదవి నుంచి దిగిపోవాల్సి వస్తోంది. 

రిషి సునాక్

ప్రస్తుతం బ్రిటన్ ఆపద్ధర్మ ప్రధానిగా ఉన్న రిషి సునాక్ సార్వత్రిక ఎన్నికల్లో నార్తర్న్ ఇంగ్లండ్ ఎంపీ స్థానం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. ఆయన గతంలోనూ ఇదే స్థానం నుంచి నెగ్గారు. ఆయన 47.5 శాతం ఓట్లు దక్కించుకున్నారు. 

దేశంలో ద్రవ్యోల్బణం పెరగడం, నిరుద్యోగ సమస్య, ఆరోగ్య బీమా అంశాలు, అంతర్జాతీయ సమస్యలపై ప్రభుత్వ వైఖరి... ఇలా అనేక కారణాలతో రిషి సునాక్ నాయకత్వంలోని కన్జర్వేటివ్ పార్టీ పట్ల ప్రజలు ఎన్నికల్లో తీవ్ర వ్యతిరేకత కనబరిచారు.

శివానీ రాజా

శివానీ రాజా... లేబర్ పార్టీకి చెందిన మహిళా రాజకీయ నేత. ఆమె ఈ ఎన్నికల్లో లీసెస్టర్ (తూర్పు) నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందారు. మాజీ ఎంపీలు, రాజకీయ దిగ్గజాలు క్లాడ్ వెబ్, కీత్ వాజ్ లీసెస్టర్ నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్లుగా బరిలో దిగడంతో ఇక్కడ గట్టి పోటీ నెలకొంది. అయితే, శివానీ రాజానే విజయం వరించింది. 

శివానీ లీసెస్టర్ లోనే పుట్టి పెరిగారు. హెర్రిక్ ప్రైమరీ స్కూల్లో ప్రాథమిక విద్యాభ్యాసం పూర్తి చేశారు. సోర్ వ్యాలీ కాలేజ్, క్వీన్ ఎలిజబెత్-2 కాలేజీలో చదువుకున్నారు. ఆమె డి మోంట్ ఫోర్ట్ యూనివర్సిటీ నుంచి కాస్మెటిక్ సైన్స్ లో ఫస్ట్ క్లాస్ ఆనర్స్ డిగ్రీ అందుకున్నారు. 

కనిష్క నారాయణ్

వేల్స్ ప్రాంతంలో మైనారిటీ నేపథ్యంతో ఎన్నికైన మొట్టమొదటి భారత సంతతి ఎంపీ కనిష్క నారాయణ్. నారాయణ్ భారత్ లోనే పుట్టారు. 12 ఏళ్ల వయసున్నప్పుడు ఆయన కుటుంబం బ్రిటన్ లోని కార్డిఫ్ కు వలస వచ్చింది. ప్రత్యేక స్కాలర్ షిప్ సాధించి ఈటన్ విద్యాసంస్థలో చదువుకున్న కనిష్క నారాయణ్... ఆ తర్వాత ప్రపంచ ప్రఖ్యాత ఆక్స్ ఫర్డ్ వర్సిటీ, స్టాన్ ఫర్డ్ వర్సిటీలో విద్యాభ్యాసం చేశాడు. 

సువెల్లా బ్రువెర్మన్

భారత సంతతికి చెందిన సువెల్లా బ్రువెర్మన్ ఈ ఎన్నికల్లో ఫేర్ హామ్ అండ్ వాటర్లూ విల్లా ఎంపీ స్థానం నుంచి విజయం సాధించారు. రిషి సునాక్ క్యాబినెట్లో ఆమె హోంమంత్రిగా వ్యవహరించారు. అయితే పదవీకాలం మధ్యలోనే ఉద్వాసనకు గురయ్యారు. అప్పట్లో సువెల్లా బ్రువెర్మన్ స్థానంలో జేమ్స్ క్లెవర్లీని హోంమంత్రిగా నియమించారు. లండన్ పోలీసులు పాలస్తీనా మద్దతుదారుల పట్ల అనుకూల వైఖరిని కనబరుస్తున్నారంటూ చేసిన ఆరోపణలు సువెల్లా బ్రువెర్మన్ కు ప్రతికూలంగా మారాయి. 

గగన్ మహీంద్రా

గగన్ మహీంద్రా బ్రిటన్ సార్వత్రిక ఎన్నికల్లో కన్జర్వేటివ్ పార్టీ తరఫున పోటీ చేశారు. సౌత్ వెస్ట్ హెర్ట్ ఫోర్డ్ షైర్ నియోజకవర్గం నుంచి గెలుపొందారు. ఆయనకు 16,458 ఓట్లు లభించాయి. ఆయన సమీప ప్రత్యర్థి, లిబరల్ డెమొక్రాటిక్ పార్టీకి చెందిన శాలీ సిమింగ్టన్ కు 12,002 ఓట్లు వచ్చాయి. గగన్ మహీంద్రా... ఓ పంజాబీ హిందు కుటుంబానికి చెందిన వ్యక్తి.  

నవేందు మిశ్రా

నవేందు మిశ్రా స్టాక్ పోర్ట్ ఎంపీ స్థానం నుంచి విజయం సాధించారు. 2019 ఎన్నికల్లోనూ ఆయన ఇదే స్థానం నుంచి గెలుపొందారు. నవేందు మిశ్రా లేబర్ పార్టీ నేత. ఈ ఎన్నికల్లో ఆయనకు 21,787 ఓట్లు వచ్చాయి. 

సత్వీర్ కౌర్

బ్రిటన్ సార్వత్రిక ఎన్నికల్లో సౌతాంప్టన్ టెస్ట్ నియోజకవర్గం నుంచి సత్వీర్ కౌర్ జయభేరి మోగించారు. ఆమె లేబర్ పార్టీకి చెందిన మహిళా నేత. ఆమె భారీ మెజారిటీతో నెగ్గారు. సీనియర్ ఎంపీ అలెన్ వైట్ హెడ్ రాజకీయాల నుంచి తప్పుకోవడంతో ఈ ఎన్నికల్లో సత్వీర్ కౌర్ కు టికెట్ ఇచ్చారు. 




More Telugu News