విరాట్ కోహ్లీ మొబైల్ వాల్‌పేప‌ర్‌గా నీమ్ క‌రోలీ బాబా ఫొటో.. ఇంతకీ ఎవ‌రీయ‌న‌?

  • బాబా నీమ్ క‌రోలీని చాలామంది హ‌నుమంతుని అవ‌తారంగా భావిస్తారు 
  • యూపీలో జ‌న్మించిన ఈయ‌న అస‌లు పేరు ల‌క్ష్మ‌ణ్ నారాయ‌ణ్ శ‌ర్మ‌
  • చిన్న‌త‌నంలోనే సాధువుగా మారిన వైనం
  • త‌న ప్ర‌వ‌చ‌నాల ద్వారా ల‌క్ష‌లాది మంది భ‌క్తుల‌ను సొంతం చేసుకున్న బాబా
  • తాజాగా కోహ్లీ మొబైల్ వాల్‌పేప‌ర్‌గా బాబా ఫొటో క‌నిపించ‌డంతో ఎవ‌రంటూ నెటిజ‌న్ల వెతుకులాట‌ 
విరాట్ కోహ్లీకి భ‌క్తి భావం కూడా ఎక్కువే. దీనికి నిద‌ర్శ‌నం తాజాగా కోహ్లీ ఫోన్‌ వాల్‌పేపర్‌గా ఓ ఆధ్యాత్మిక గురువు, కొంతమంది సాక్షాత్తు దైవస్వరూపంగా భావించే ‘నీమ్‌ కరోలీ బాబా’ ఫొటో ఉండటమే. భారత జట్టు టీ20 వరల్డ్‌ కప్‌ గెలిచి.. గురువారం స్వదేశానికి తిరిగి వచ్చిన సందర్భంగా.. ముంబైలో విక్టరీ పరేడ్‌ నిర్వహించారు. అనంత‌రం టీమిండియాను వాంఖ‌డే స్టేడియంలో ఘ‌నంగా స‌న్మానించారు. ఇక ఈ వేడుక ముగిసిన త‌ర్వాత విరాట్ కోహ్లీ త‌న భార్య‌, పిల్ల‌ల‌ను క‌ల‌వ‌డానికి లండ‌న్ వెళ్లిపోయాడు. 

లండ‌న్ విమానాశ్ర‌యంలో దిగిన త‌ర్వాత త‌న డ్రైవ‌ర్‌కు గుడ్‌బై చెప్పే సమయంలోనే విరాట్‌ కోహ్లీ ఫోన్‌ వాల్‌పేపర్‌పై నీమ్‌ కరోలీ బాబా ఫొటో ఉండటం కెమెరా కంటికి చిక్కింది. ఆ ఫొటోను ఎక్స్ యూజ‌ర్ ముఫ్దాల్ వొహ్రా షేర్ చేశారు. దీంతో ఒక్కసారిగా నీమ్‌ కరోలీ బాబా ఎవరు? విరాట్‌ కోహ్లీ లాంటి స్టార్‌ క్రికెటర్‌ ఆయన ఫొటోను వాల్‌పేపర్‌గా పెట్టుకున్నాడంటూ క్రికెట్‌ అభిమానులు చర్చించుకుంటున్నారు. దీంతో ఈ ఫొటో ఒక్క‌సారిగా సోషల్ మీడియాలో వైర‌ల‌వుతోంది. 


బాబా నీమ్ క‌రోలీ ఎవ‌రంటే..!
బాబా నీమ్ క‌రోలీని చాలామంది హ‌నుమంతుని అవ‌తారంగా భావిస్తారు. ఆయన అద్భుతాల‌ను తెలిపే అనేక క‌థ‌లు ప్ర‌చారంలో ఉన్నాయి. హిందుస్థాన్ టైమ్స్ మ‌రాఠీ నివేదిక ప్ర‌కారం బాబా ప్రధాన ఆశ్ర‌మం 1964లో కైంచి ధామ్‌లో స్థాపించ‌బ‌డింది. బాబా నీమ్ క‌రోలీ ఆశ్ర‌మానికి యాపిల్ సంస్థ స‌హ‌ వ్య‌వ‌స్థాప‌కుడు స్టీవ్ జాబ్స్, ఫేస్‌బుక్ వ్య‌వ‌స్థాప‌కుడు మార్క్ జుక‌ర్‌బ‌ర్గ్‌, హాలీవుడ్ న‌టి జూలియా రాబ‌ర్ట్స్ వంటివారు కూడా ద‌ర్శించారు. వీరు కూడా బాబాకు భ‌క్తులు.   

ఇక యూపీలో జ‌న్మించిన ఈయ‌న అస‌లు పేరు ల‌క్ష్మ‌ణ్ నారాయ‌ణ్ శ‌ర్మ‌. చిన్న‌త‌నంలోనే సాధువుగా మారారు. త‌న ప్ర‌వ‌చ‌నాల ద్వారా ల‌క్ష‌లాది మంది భ‌క్తుల‌ను సొంతం చేసుకున్నారు. 1973లోనే బాబా నీమ్ క‌రోలీ మ‌ర‌ణించారు. కాగా, గ‌తేడాది హోలీ పండుగ సందర్భంగా కోహ్లీ దంప‌తులు ఆయ‌న ఆశ్ర‌మాన్ని సంద‌ర్శించారు. ఆ త‌ర్వాత సోష‌ల్ మీడియా వేదిక‌గా ఆయ‌న‌కు నివాళుల‌ర్పించారు.


More Telugu News