కానిస్టేబుల్ ఉద్యోగం వదిలి... 20 ఏళ్లలో 100 కోట్లు కూడబెట్టిన భోలే బాబా

  • అత్యాధునిక లగ్జరీ కార్ల వినియోగం... విలాసవంతమైన జీవితం
  • రాజభవనంలా కనిపించే ఆశ్రమం... దేశవ్యాప్తంగా 24 ఆశ్రమాలు
  • దాదాపు 30 లగ్జరీ కార్లతో భోలే బాబా కాన్వాయ్
హథ్రాస్‌లో 121 మంది మృతికి కారణమైన భోలే బాబా గత రెండు దశాబ్దాలలో రూ.100 కోట్ల ఆస్తులను కూడబెట్టాడు. అత్యాధునిక లగ్జరీ కార్లు అతని వద్ద ఉన్నాయి. విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నాడు. మంగళవారం విషాదం జరిగినప్పటి నుంచి భోలే బాబా పరారీలో ఉన్నాడు. అతని వద్దకు వెళ్తే దెయ్యాలు వదులుతాయని, తమ వివాదాలు దూరమవుతాయని ఎంతోమంది నమ్ముతారు. ఆయన భక్తులు భోలే బాబాను దేవదూతగా భావిస్తారు.

అతని ఆశ్రమం ఫైవ్ స్టార్ హోటల్‌లా... రాజభవనంలా ఉంటుంది. కాస్‌గంజ్‌, ఆగ్రా, కాన్పూర్‌, గ్వాలియర్‌ సహా దేశవ్యాప్తంగా మొత్తం 24 విలాసవంతమైన ఆశ్రమాలు ఉన్నాయి. వీటిలో అత్యధికంగా ఉత్తరప్రదేశ్‌లోనే ఉన్నాయి. శ్రీ నారాయణ్‌ హరి సాకార్‌ ఛారిటబుల్‌ ట్రస్ట్‌ పేరిట వీటిని నిర్వహిస్తున్నారు. అత్యంత సన్నిహితంగా ఉండే వాళ్లే వీటి నిర్వహణ బాధ్యతలను చూస్తుంటారు. భోలే బాబా సూరజ్‌పాల్‌ మెయిన్‌పురిలోని విలాసవంతమైన హరినగర్‌ ఆశ్రమంలో ఉంటున్నాడు. ఈ ఆశ్రమం మొత్తం 13 ఎకరాల్లో విస్తరించి ఉంది. ఈ భవనం నిర్మాణానికే రూ.4 కోట్లకు పైగా ఖర్చయింది.

భోలే బాబా గార్డులలో ఒకరు మెయిన్‌పురిలోని ఆ భూమిని ట్రస్ట్‌కు విరాళంగా ఇచ్చారని సంబంధిత వర్గాలు తెలిపాయి. అతని ఇంటికి చేరుకోవడానికి ముందు గార్డ్స్ క్వార్టర్స్‌ను దాటాలి. ఆయనకు దాదాపు 16 మంది వ్యక్తిగత కమాండోలు ఉంటారు. తెల్లటి టయోటా ఫార్చునర్‌ కారును ఉపయోగిస్తాడు. అందులో బాబా ప్రయాణిస్తుండగా ముందు ఆయన కమాండోలు బైక్‌లపై దారిని క్లియర్‌ చేస్తారు. దాదాపు 30 లగ్జరీ కార్లతో ఆయన కాన్వాయ్‌ ఉంటుంది. భోలే బాబా ఉపయోగించే కారు ఇంటీరియర్‌ మొత్తం తెలుపు రంగులోనే ఉంటుంది.

కానిస్టేబుల్ ఉద్యోగం వదిలి...

భోలే బాబా 1999లో తన కానిస్టేబుల్ ఉద్యోగాన్ని విడిచిపెట్టి... బోధనలు ప్రారంభించాడు. ఖరీదైన వస్తువులు, విలాసవంతమైన జీవితం కోరుకున్నాడు. అందుకే అతను లగ్జరీ కార్లు ఉపయోగిస్తున్నాడు. చాలా కార్లను భక్తుల పేరిట కొనుగోలు చేశాడు. ఇక్కడ మరో ఆసక్తికర విషయం ఏమంటే 'ఇక్కడ డొనేషన్లు తీసుకోబడవు' అని ఆశ్రమంలో రాసి ఉంటుంది. మరోవైపు, ఆశ్రమంలోని గోడలపై ఆయా దాతల పేర్లు రాసి ఉంటాయి. 100 బ్యాగుల సిమెంట్ ఇవ్వడం మొదలు ఆశ్రమ నిర్మాణానికి నగదు ఇచ్చిన వారందరి పేర్లూ ఉన్నాయి.

తనను నమ్మే వారిని భోలే బాబా అనేక మూఢ నమ్మకాలతో ముంచేవాడని తెలుస్తోంది. ముఖ్యంగా తాను నిర్వహించే సత్సంగ్‌లలో ఇచ్చే పవిత్ర జలం తాగితే భక్తుల సమస్యలు తీరిపోతాయనే ప్రచారం చేయించాడు. తన పాదధూళి కూడా పవిత్రమైనదని, బాబా నడిచిన నేలపై మట్టిని తాకినా అదృష్టం వరిస్తుందనే నమ్మకాన్ని సృష్టించాడు. ఇవి నమ్మి యూపీతో పాటు ఉత్తరాఖండ్‌, హర్యానా, రాజస్థాన్‌, ఢిల్లీ నుంచి పెద్ద ఎత్తున జనం భోలే బాబా దర్శనం కోసం వచ్చేవారు.


More Telugu News