'వందేమాతరం' పాట‌కు కోహ్లీ, పాండ్యా స‌హా భార‌త జ‌ట్టు చేసిన పనికి గూస్‌బంప్స్.. ఇదిగో వీడియో!

  • వాంఖ‌డేలో భార‌త ఆట‌గాళ్ల‌కు ఘ‌న స‌న్మానం
  • వేడుక ముగిసిన తర్వాత టీమిండియా వాంఖడే చుట్టూ దేశభక్తి గీతాలపై ర్యాలీ
  • ఆ స‌మ‌యంలో ఐకానిక్ 'వందేమాతరం' పాట ప్ర‌సారం
  • టీమిండియా స‌భ్యులంద‌రూ ఆ పాట‌ను పాడుతూ ఫ్యాన్స్‌లో జోష్ నింపిన వైనం
టీ20 ప్రపంచకప్ 2024 ట్రోఫీతో స్వ‌దేశానికి చేరుకున్న టీమిండియా ఆటగాళ్లకు ఢిల్లీలో ఘన స్వాగతం ల‌భించింది. ఆ త‌ర్వాత‌ ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశం తర్వాత ముంబై చేరుకున్నారు. ముంబైలోని వాంఖడే స్టేడియంలో సన్మానించేందుకు బీసీసీఐ ఘ‌నంగా ఏర్పాట్లు చేసింది. మెరైన్ డ్రైవ్ ప్రాంతంలో విజయోత్సవ ర్యాలీ నిర్వహించిన‌ అనంత‌రం టీమిండియా వాంఖడే మైదానానికి చేరుకోగానే హర్షధ్వానాలతో స్టేడియం మార్మోగింది. ఆటగాళ్లు జాతీయ జెండాలు చేతబూని స్టేడియమంతా కలియతిరిగారు. బాలీవుడ్ పాటలకు స్టెప్పులు వేసి అభిమానుల్లో జోష్ నింపారు.

అనంతరం వాంఖడే స్టేడియంలో భారత ఆటగాళ్లు ప్రపంచకప్ ఆనందాన్ని అభిమానులతో పంచుకున్నారు. వాంఖడే స్టేడియంలో జరిగిన సన్మాన కార్యక్రమంలో కోహ్లీ మాట్లాడుతూ, "స్టేడియంలోకి వచ్చిన వారందరికీ ధన్యవాదాలు. ఈ రాత్రి వీధుల్లో చూసింది నా జీవితంలో ఎప్పటికీ మరచిపోలేను" అని అన్నారు.

ఇక వేడుక ముగిసిన తర్వాత భారత జట్టు వాంఖడే స్టేడియం చుట్టూ దేశభక్తి గీతాలపై ర్యాలీ తీసింది. ఆ స‌మ‌యంలో ఐకానిక్ 'వందేమాతరం' పాట ప్ర‌సారమైంది. దాంతో విరాట్ కోహ్లీ, హార్దిక్ పాండ్యాతో పాటు టీమిండియా స‌భ్యులంద‌రూ ఆ పాట‌ను ఆల‌పించారు. అది చూసిన‌ అభిమానులకు గూస్‌బంప్స్ వ‌చ్చాయి. దీని తాలూకు వీడియో ఇప్పుడు నెట్టింట వైర‌ల్ అవుతోంది.


More Telugu News