హత్రాస్‌కు రాహుల్ గాంధీ.. తొక్కిసలాటలో మృతుల కుటుంబాలకు పరామర్శ

  • ఈ విషాదాన్ని రాజకీయ కోణంలో చూడబోనన్న రాహుల్ గాంధీ
  • ప్రభుత్వం మరింత నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్
  • పరిహారం చెల్లింపు ఆలస్యం చేస్తే ఎవరికీ ప్రయోజనం ఉండదని వ్యాఖ్య
ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్‌లో ఇటీవల జరిగిన తొక్కిసలాట విషాద ఘటనలో మరణించిన వ్యక్తుల కుటుంబాలను లోక్‌సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ పరామర్శించారు. ఈ మేరకు శుక్రవారం ఉదయం తొక్కిసలాట జరిగిన హత్రాస్‌కు ఆయన చేరుకున్నారు. పలు కుటుంబాలను ఆయన ఓదార్చారు.

ఇది చాలా బాధాకరమైన దుర్ఘటన అని, చాలా మంది ప్రాణాలు కోల్పోయారని, ఈ విషాదాన్ని తాను రాజకీయ కోణంలో చూడదలుచుకోలేదని అన్నారు. అయితే పాలనపరమైన లోపాలు ఉన్నాయని అన్నారు. అయితే చనిపోయినవారు పేదలు కావడంతో నష్టపరిహారం పెద్ద మొత్తంలో ఇవ్వాలని రాహల్ డిమాండ్ చేశారు. నష్టపరిహారం విషయంలో జాప్యం జరిగితే ఎవరికీ ప్రయోజనం ఉండదని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ని తాను కోరుతున్నట్టు రాహుల్ పేర్కొన్నారు. బాధిత కుటుంబాలన్నీ షాక్‌లో ఉన్నాయని, వారి పరిస్థితిని అర్థం చేసుకోవాలని అన్నారు. రాహుల్ గాంధీ వెంట యూపీ కాంగ్రెస్ అధ్యక్షుడు అజయ్ రాయ్, రాష్ట్ర కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ అవినాశ్ పాండే, పార్టీ అధికార ప్రతినిధి సుప్రియా శ్రీనాటే, ఇతరులు ఉన్నారు.

కాగా హత్రాస్ తొక్కిసలాటలో ఏకంగా 121 మంది ప్రాణాలు కోల్పోగా.. వందలాది మంది గాయపడిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై న్యాయ విచారణకు సీఎం యోగి ఆదేశాలు జారీ చేశారు. ఇక మంగళవారం హత్రాస్‌ను సీఎం యోగి సందర్శించారు. తొక్కిసలాటలో గాయపడిన వారు, మృతుల బంధువులను పరామర్శించారు.


More Telugu News