అతడి నుంచి ఫోన్ రావడంతో 2023 వరల్డ్ కప్ తర్వాత వైదొలగలేదు: రాహుల్ ద్రావిడ్

  • రోహిత్ శర్మ నుంచి తన జీవితంలో బెస్ట్ ఫోన్ కాల్ వచ్చిందన్న ద్రావిడ్
  • మరో 6 లేదా 8 నెలల్లో మనం సాధించాల్సింది మరొకటి ఉందంటూ చెప్పినట్టు వెల్లడి
  • వన్డే వరల్డ్ కప్ 2023 ఫైనల్ ఓటమి తర్వాత రోహిత్ శర్మ నుంచి ఫోన్ వచ్చిందన్న ద్రావిడ్
  • టీ20 వరల్డ్ కప్ 2024తో కోచ్‌గా ముగిసి పోయిన ద్రావిడ్ పదవీకాలం
టీ20 ప్రపంచ కప్-2024ను గెలిచిన భారత క్రికెట్ జట్టుకు గురువారం ఘన సన్మానం జరిగింది. ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఆటగాళ్లను బీసీసీఐ సత్కరించింది. టీ20 వరల్డ్ కప్‌తో కోచ్‌గా పదవీకాలం ముగిసిపోయిన రాహుల్ ద్రావిడ్ ఈ సందర్భంగా ఆసక్తికరమైన విషయాన్ని పంచుకున్నారు. 2023 వన్డే వరల్డ్ కప్ తర్వాత కోచ్‌గా కొనసాగడానికి గల కారణాన్ని ద్రావిడ్ బయటపెట్టారు. వన్డే ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ ఓటమి తర్వాత కెప్టెన్ రోహిత్ శర్మ నుంచి తనకు ఫోన్ కాల్ వచ్చిందని, ఆ ఫోన్ కాల్‌తో ఆగిపోయానని చెప్పారు.

 ‘‘ నా జీవితంలో అదే అత్యుత్తమ ఫోన్ కాల్’’ అని భారత దిగ్గజ క్రికెటర్ వ్యాఖ్యానించారు. ‘‘వన్డే వరల్డ్ కప్ 2023 తర్వాత కొనసాగాలా వద్దా అనే అంశంపై నేను కచ్చితమైన నిర్ణయానికి రాలేదు. కోచ్‌గా అద్భుతమైన వన్డే ప్రపంచకప్ కావడంతో చాలా ఆనందం ఉంది. అయితే ఫైనల్ మ్యాచ్ గెలవలేకపోవడంతో నిరాశకు గురయ్యాయి. రోహిత్ నాకు ఫోన్ చేశాడు. రాహుల్ మరో 6 లేదా 8 నెలల వ్యవధిలో మనం మరొకటి సాధించాలి. మీతో కలిసి సాధించడం బావుంటుందని రోహిత్ నాతో అన్నాడు’’ అని రాహుల్ ద్రావిడ్ చెప్పారు. వాంఖడే స్టేడియంలో ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమంలో రాహుల్ ద్రవిడ్ ఈ విషయాన్ని వెల్లడించారు. ఇక భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్‌గా తన గడువు ముగిసిపోవడంతో వాటన్నింటినీ తాను కోల్పోబోతున్నట్టు ద్రావిడ్ అన్నారు. ఈ ప్రేమను కోల్పోబోతున్నానని వ్యాఖ్యానించాడు.

కాగా ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో ఓటమి, ఆ తర్వాత వన్డే వరల్డ్ కప్-2023 ఫైనల్ మ్యాచ్‌లో పరాజయం తర్వాత ఎట్టకేలకు టీ20 ప్రపంచ కప్ 2024 టైటిల్‌ను టీమిండియా గెలిచింది. దీంతో 17 సంవత్సరాల తర్వాత టీ20 ప్రపంచ కప్ టైటిల్‌ను భారత్ గెలిచినట్టయింది. ఫైనల్ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాపై ఉత్కంఠభరిత విజయాన్ని అందుకుంది. ఆటగాళ్ల కెరీర్‌లో అద్భుతమైన ఈ ఘట్టంలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ, స్టార్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా తమ టీ20 కెరియర్లకు గుడ్‌బై పలికిన విషయం తెలిసిందే. అదేవిధంగా కోచ్‌గా రాహుల్ ద్రవిడ్ పదవీకాలం కూడా ముగిసిపోయింది.


More Telugu News