బీహార్ లోనూ హిందీలో ఎంబీబీఎస్ కోర్సు

  • త్వరలో మొదలయ్యే విద్యాసంవత్సరం నుంచి అమలు
  • బీహార్ వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి మంగళ్ పాండే ప్రకటన
  • ఇప్పటికే హిందీ మీడియం ప్రవేశపెట్టిన మధ్యప్రదేశ్ సర్కారు
  • పెద్దగా ఆసక్తి చూపని విద్యార్థులు
ఎంబీబీఎస్ కోర్సును ప్రస్తుతం ఉన్న ఆంగ్ల మీడియంతోపాటు హిందీ మీడియంలోనూ అందించాలని బీహార్ ప్రభుత్వం నిర్ణయించింది. తద్వారా మధ్యప్రదేశ్ తర్వాత హిందీ మాధ్యమంలో ఎంబీబీఎస్ కోర్సును ప్రవేశపెట్టిన రెండో రాష్ర్టంగా నిలిచింది. ఈ మేరకు బీహార్ వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి మంగళ్ పాండే తాజాగా ప్రకటన చేశారు. త్వరలో మొదలయ్యే విద్యాసంవత్సరం నుంచి విద్యార్థులు హిందీ మీడియంలో చదవొచ్చని చెప్పారు. 

‘ఎంబీబీఎస్ కోర్సుకు సంబంధించి హిందీ మాధ్యమంలో పాఠ్యపుస్తకాలు అందుబాటులో ఉన్నాయా లేదా అని పరిశీలించాం. ఇకపై హిందీ మాధ్యమంలోనూ కోర్సును ప్రవేశపెట్టాలని సీఎం నితీశ్ కుమార్ నాయకత్వంలో నిర్ణయం తీసుకున్నాం. హిందీ భాషను ప్రోత్సహించాలన్న ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా ఈ నిర్ణయం ఉంది. హిందీని ప్రపంచ భాషగా మార్చాలనేది మా ఉద్దేశం’ అని మంత్రి మంగళ్ పాండే వివరించారు.  

నీట్ యూజీ–2024 పాసైన విద్యార్థులకు ఢిల్లీ ఎయిమ్స్ సిలబస్ కు అనుగుణంగా హిందీ మాధ్యమంలో కొత్త కోర్సును అమలు చేస్తామని మంత్రి చెప్పారు. రాష్ర్టంలో 85 వేల ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయని.. వాటిల్లో హిందీ మీడియం ద్వారానే బోధనకు ప్రాధాన్యం ఇస్తున్నామని వివరించారు.

దేశంలోనే తొలిసారిగా మధ్యప్రదేశ్ ప్రభుత్వం హిందీ మాధ్యమంలో ఎంబీబీఎస్ కోర్సును ప్రవేశపెట్టింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఓ కార్యక్రమంలో హిందీ మాధ్యమంలో ఉన్న ఎంబీబీఎస్ కోర్సు పుస్తకాలను ఆవిష్కరించారు. కానీ హిందీ మీడియం ప్రవేశపెట్టి నెలలు గడిచినప్పటికీ హిందీలో ఎంబీబీఎస్ కోర్సు చేసేందుకు విద్యార్థులు పెద్దగా ఆసక్తి చూపలేదు. ఎడ్యుకేషన్ టైమ్స్ గణాంకాల ప్రకారం.. భోపాల్ లోని గాంధీ మెడికల్ కాలేజీలో 250 ఎంబీబీఎస్ సీట్లు ఉండగా కేవలం 25 మంది విద్యార్థులే హిందీ మాధ్యమంలో చదివేందుకు ఇష్టపడ్డారు.


More Telugu News