మచిలీపట్టణంలో రూ. 60 వేల కోట్లతో బీపీసీఎల్ రిఫైనరీ.. త్వరలోనే అధికారిక ప్రకటన

  • పెట్రోలియం శాఖ మంత్రితో చంద్రబాబు భేటీ
  • రూ. 60 వేల కోట్లతో రిఫైనరీ ఏర్పాటు
  • పోర్టు అందుబాటులో ఉండడం, రాజధానికి సమీపంలో ఉండడం కలిసొచ్చే విషయాలు
  • పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు
  • మచిలీపట్టణం అభివృద్ది చెందుతున్న జనసేన ఎంపీ బాలశౌరి
మచిలీపట్టణంలో త్వరలోనే భారత పెట్రోలియం కార్పొరేషన్ (బీపీసీఎల్) రిఫైనరీ ఏర్పాటు కాబోతోంది. కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్‌సింగ్ పురితో ఢిల్లీలో నిన్న భేటీ అయిన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రిఫైనరీపై చర్చించారు. ఈ సందర్భంగా మచిలీపట్టణంలో రిఫైనరీ ఏర్పాటుకు అవసరమైన 2-3 వేల ఎకరాల భూమిని ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్టు చెప్పారు. అంతేకాదు, ఇంకా కావాలన్నా ఇస్తామని మచిలీపట్టణం జనసేన ఎంపీ వల్లభనేని బాలశౌరి కేంద్రమంత్రికి తెలిపారు. 

పోర్టు అందుబాటులో ఉండడం, రాజధానికి దగ్గర ఉండడం కలిసి వస్తుందని చెప్పారు. దీనికి కేంద్రమంత్రి సానుకూలంగా స్పందించారు. రూ. 60 వేల కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేసే రిఫైనరీ నాలుగేళ్లలో పూర్తవుతుంది. దీని ఏర్పాటుకు సంబంధించి త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. కాగా, రిఫైనరీ ఏర్పాటుతో మచిలీపట్టణం ప్రాంతం అభివృద్ధి చెందడంతోపాటు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు లభిస్తాయని బాలశౌరి తెలిపారు.


More Telugu News