యూకే ఎన్నికల్లో రిషి సునాక్ పార్టీకి ఘోర ఓటమి.. లేబర్ పార్టీదే విజయం.. ఎగ్జిట్ పోల్స్ అంచనా

  • కన్జర్వేటివ్ పార్టీకి ఓటమి తప్పదన్న ఎగ్జిట్ పోల్స్
  • లేబర్ పార్టీకి 410, కన్జర్వేటివ్ పార్టీకి 131 స్థానాలు వస్తాయని విశ్లేషణ
  • కీర్ స్టార్మర్ బ్రిటన్ తదుపరి ప్రధాని అవుతారని అంచనా
గురువారం జరిగిన యూకే పార్లమెంటరీ ఎన్నికలలో ప్రధాని రిషి సునాక్ ప్రాతినిధ్యం వహిస్తున్న కన్జర్వేటివ్ పార్టీకి ఘోర ఓటమి తప్పదని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. లేబర్ పార్టీ ఏకపక్ష విజయం సాధించబోతోందని, ఆ పార్టీ నేత కీర్ స్టార్మర్ తదుపరి బ్రిటన్ ప్రధాని కానున్నారని ఎగ్జిట్ పోల్స్ విశ్లేషించాయి. కాగా గురువారం రాత్రి 10 గంటల సమయంలో యూకే పార్లమెంట్ పోలింగ్ ప్రక్రియ ముగియడంతో ఎగ్జిట్ పోల్స్ వెలువడ్డాయి. పార్లమెంట్‌లో మొత్తం 650 సీట్లు ఉండగా లేబర్ పార్టీ 410 స్థానాలను గెలుచుకోబోతోందని అంచనా వేశాయి. దీంతో 14 ఏళ్లుగా కొనసాగుతున్న కన్జర్వేటివ్ పార్టీ ప్రభుత్వానికి ముగింపు పడబోతోందని పేర్కొన్నాయి.

ఇక ఈ ఎన్నికల్లో కన్జర్వేటివ్ పార్టీకి 131 స్థానాలు మాత్రమే వస్తాయని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. కాగా గత ఎన్నికల్లో ఆ పార్టీ 346 సీట్లు గెలిచింది. 2016 నుంచి ఇప్పటివరకు కన్జర్వేటివ్ పార్టీలో ఐదుగురు వేర్వేరు ప్రధాన మంత్రులు మారారు. జీవన వ్యయాల పెరుగుదల, కొన్నేళ్లుగా కొనసాగుతున్న అస్థిరత, పార్టీలో అంతర్గత పోరు కన్జర్వేటివ్‌ల ఓటమికి కారణాలు కాబోతున్నాయని ఎగ్జిట్ పోల్స్ విశ్లేషించాయి.

కాగా యూకే పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించిన అధికారిక ఫలితాలు మరికొన్ని గంటల్లో వెలువడనున్నాయి. ఈ మేరకు కౌంటింగ్ ప్రక్రియ మొదలైంది.


More Telugu News