కె.కేశవరావుకు కీలక పదవి... ప్రభుత్వ ప్రత్యేక సలహాదారుగా నియమించాలని రేవంత్ రెడ్డి నిర్ణయం!

  • రాజకీయ, పాలనాపరమైన అనుభవాలను వినియోగించుకోవాలని భావిస్తున్న రేవంత్ రెడ్డి
  • త్వరలో అధికారిక ప్రకటన వెలువడే అవకాశం
  • నిన్న ఖర్గే సమక్షంలో కాంగ్రెస్‌లో చేరిన కేశవరావు
తెలంగాణ సీనియర్ నేత కె.కేశవరావును ప్రభుత్వ ప్రత్యేక సలహాదారుగా నియమించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. కేకేకు ఉన్న రాజకీయ, పరిపాలనపరమైన అనుభవాలను వినియోగించుకోవడానికి సలహాదారుగా నియమించాలని భావిస్తున్నారు. దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

బీఆర్ఎస్ పార్టీని వీడిన కేకే నిన్న ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సమక్షంలో కాంగ్రెస్ కండువాను కప్పుకున్నారు. బీఆర్ఎస్ ద్వారా తనకు వచ్చిన రాజ్యసభ పదవికి ఆయన ఇవాళ రాజీనామా చేశారు. అనంతరం కేకే మాట్లాడుతూ... తాను కాంగ్రెస్ మనిషిని అన్నారు. కాంగ్రెస్ తనకు సొంతిల్లు వంటిదని చెప్పారు. 

తెలంగాణలో కాంగ్రెస్ పాలనపై మాట్లాడుతూ... ఆరు నెలల్లో ఎవరినీ అంచనా వేయలేమన్నారు. బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడిగా ఉన్నందువల్ల నైతిక విలువలతో రాజీనామా చేసినట్లు చెప్పారు. రాజ్యసభ చైర్మన్‌కూ ఇదే విషయం చెప్పానని వెల్లడించారు. కాంగ్రెస్ ఎంపీలతోనే తెలంగాణ వచ్చిందన్నారు.


More Telugu News