వైసీపీ నేతలు జైలు పాలవడానికి సగం కారణం జగనే: టీడీపీ ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ

  • నెల్లూరు జైలులో పిన్నెల్లిని పరామర్శించిన జగన్
  • జగన్ పై టీడీపీ నేతల ఫైర్
  • జగన్ వత్తాసు వల్లే వైసీపీ నేతలు అరాచకాలకు పాల్పడ్డారన్న అనురాధ
ఈవీఎం పగులగొట్టిన మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని వైసీపీ అధినేత జగన్ పరామర్శించడం పట్ల టీడీపీ నేతలు మండిపడుతున్నారు. ఈవీఎం ధ్వంసం చేసిన ప్రజాస్వామ్య ఖూనీకోరు పిన్నెల్లికి వత్తాసు పలుకుతున్నారా?... సిగ్గుచేటు అంటూ టీడీపీ ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ మాజీ సీఎం జగన్ పై ధ్వజమెత్తారు. 

జగన్ ప్రోత్సాహం వల్లే వైసీపీ నేతలు అరాచకాలకు పాల్పడ్డారని ఆరోపించారు. వైసీపీ నేతలు జైలు పాలవడానికి సగం కారణం జగనే అని పంచుమర్తి అనురాధ విమర్శించారు. పిన్నెల్లి చేసిన పాపాలకు నెల్లూరు జైలులో కాదు, తీహార్ జైల్లో పెట్టాలని అన్నారు. 

జగన్ తీరు దెయ్యాలు వేదాలు వల్లించినట్టుందని ఆమె ఎద్దేవా చేశారు. ఈ ఐదేళ్లలో వైసీపీ నేతలు లెక్కలేనన్ని అరాచకాలకు పాల్పడ్డారని తెలిపారు. దాడుల గురించి జగన్ మాట్లాడడం విడ్డూరంగా ఉందని, టీడీపీ కార్యకర్తలపై జరిగిన దాడులు కనపడలేదా? అని అనురాధ ప్రశ్నించారు. ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పినా, జగన్ బుద్ధి ఏమాత్రం మారలేదని విమర్శించారు. 

పిన్నెల్లిని జగన్ వెనకేసుకొస్తున్నారు: బుద్ధా వెంకన్న

పిన్నెల్లికి జగన్ పరామర్శపై టీడీపీ సీనియర్ నేత బుద్ధా వెంకన్న కూడా స్పందించారు. పిన్నెల్లిని జగన్ వెనుకేసుకొస్తున్నారని ఆరోపించారు. దుర్మార్గమైన పనులు చేసింది వైసీపీ వారేనని, వైసీపీ నేతల అరాచకాలను ప్రజలు మర్చిపోరని అన్నారు. "గత ఐదేళ్లుగా మీ దురాగతాలను భరించలేకే ప్రజలు మిమ్మల్ని 11 సీట్లలో కూర్చోబెట్టారు. మీరు ఇంకా మారకపోతే ఈసారి అవి కూడా రావు" అని స్పష్టం చేశారు.


More Telugu News