అమరావతికి మంచి రోజులు.. రూ. 250 కోట్ల పెట్టుబడులతో మళ్లీ వచ్చేసిన ఎక్స్ఎల్ఆర్ఐ

  • దేశంలోనే అత్యుత్తమ మేనేజ్‌మెంట్ సంస్థగా ఎక్స్ఎల్ఆర్ఐకి గుర్తింపు
  • గతంలో టీడీపీ హయాంలో 50 ఎకరాల కేటాయింపు
  • వైసీపీ అధికారంలోకి వచ్చాక సంస్థకు ఇబ్బందులు
  • మళ్లీ చంద్రబాబు అధికారంలోకి రావడంతో వెనక్కి
  • సీఆర్‌డీఏ భూమి అప్పగించిన వెంటనే పనులు ప్రారంభం
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి మళ్లీ మంచి రోజులు వచ్చాయి. గత ఐదేళ్లుగా అమరావతి పేరే వినిపించకుండా పోయింది. చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక అమరావతిపై ప్రత్యేక దృష్టిసారించారు. రాజధాని ప్రాంతంలో ఏపుగా పెరిగిన ముళ్ల చెట్లను తొలగించి, రోడ్లను క్లియర్ చేసి, ఆగిపోయిన పనులను మళ్లీ ప్రారంభించారు. అదే సమయంలో అమరావతిలో పెట్టుబడులకు ప్రయత్నాలు ప్రారంభించారు.

ఈ క్రమంలో అమరావతికి శుభారంభం పలుకుతూ ఎక్స్ఎల్ఆర్ఐ (జేవియర్ స్కూల్ ఆఫ్ మేనేజ్‌మెంట్) అనే సంస్థ పెట్టుబడులకు ముందుకొచ్చింది. మేనేజ్‌మెంట్ ఇనిస్టిట్యూట్‌లో దేశంలోనే ఈ సంస్థకు మంచి పేరుంది. అహ్మదాబాద్ ఐఐఎం తర్వాతి స్థానం ఈ సంస్థదే. మేనేజ్‌మెంట్ కోర్సుల్లో తరగతుల నిర్వహణ, శిక్షణలో ఎక్స్ఎల్ఆర్ఐకి మంచి పేరుంది. 

గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో ఈ సంస్థకు 50 ఎకరాలు కేటాయించిన సీఆర్‌డీఏ భూమిని కూడా రిజిస్టర్ చేసింది. అయితే, తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం అభివృద్ధి పనులకు అడ్డుపడడంతో ఎక్స్‌ఎల్ఆర్ఐ పనులు నిలిపివేసి వెనక్కి వెళ్లిపోయింది.

మళ్లీ ఇప్పుడు చంద్రబాబు ముఖ్యమంత్రి కావడంతో ఇనిస్టిట్యూట్ ఏర్పాటుకు సంస్థ ముందుకు వచ్చింది. కేటాయించిన భూములు అప్పగిస్తే నిర్మాణాలకు సిద్ధంగా ఉన్నట్టు ప్రభుత్వానికి తెలిపింది. ఈ నేపథ్యంలో ఎక్స్ఎల్ఆర్ఐకి భూములు అప్పగించేందుకు సీఆర్‌డీఏ సిద్ధమైంది. దాదాపు రూ. 250 కోట్ల వ్యయంతో భవనాలను నిర్మించనున్నారు.


More Telugu News