తల్లిదండ్రుల దారుణం.. కన్నడ నటుడు దర్శన్‌‌‌ ఖైదీ నెంబర్‌తో బిడ్డకు ఫొటో షూట్!

  • ఘటనపై సీరియస్ అయిన బాలల హక్కుల సంఘం, సుమోటోగా కేసు నమోదు
  • తల్లిదండ్రులను గుర్తించాలంటూ పోలీసులకు ఆదేశం
  • ఖైదీ నెంబర్‌ను టాటూగా వేసుకుంటున్న అభిమానులు
అభిమాని హత్య కేసులో ముద్దాయిగా ఉన్న కన్నడ నటుడు దర్శన్‌కు కేటాయించిన ఖైదీ నెంబర్‌తో తమ బిడ్డ ఫొటో షూట్ నిర్వహించిన తల్లిదండ్రులు చిక్కుల్లో పడ్డారు.  ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన బాలల హక్కుల సంఘం ఆ తల్లిదండ్రులపై కేసు నమోదు చేసింది. 

పూర్తి వివరాల్లోకి వెళితే, కర్ణాటకకు చెందినట్లుగా భావిస్తోన్న ఓ జంట, తమ చిన్నారికి ఇటీవల ఫొటో షూట్ నిర్వహించారు. ఇందు కోసం దర్శన్ ఖైదీ నెంబర్ ఉన్న డ్రెస్‌ను చిన్నారికి తొడిగారు. దర్శన్‌‌ను అనుకరిస్తున్నట్టు ఈ ఫోటో షూట్ నిర్వహించారు. ఈ ఫొటోలు వైరల్‌గా మారడంతో విషయం  బాలల హక్కుల సంఘం దృష్టికి వెళ్లింది. ఘటనను సుమోటోగా స్వీకరించి కేసు నమోదు చేసింది. చిన్నారి తల్లిదండ్రులు ఎక్కడ ఉన్నారో గుర్తించాలని పోలీసులను బాలల హక్కుల సంఘం ఆదేశించింది. ఇలాంటి ఫొటో షూట్స్ బాలల హక్కుల చట్టాన్ని ఉల్లంఘించడమేనని కమిషన్ సభ్యుడు శశిధర్ కొసాంబే పేర్కొన్నారు. బాధ్యులను గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. 

దర్శన్‌కు కేటాయించిన ఖైదీ నెంబర్ 6106 పలు వికృతపోకడలకు కారణమవుతోంది. దర్శన్ అభిమానులు అనేక మంది ఈ సంఖ్యను టాటూ వేయించుకుంటున్నారు. ఈ పేరును రిజిస్ట్రేషన్ చేయించుకునేందుకు కొందరు ఫిల్మ్ ఛాంబర్‌ను ఆశ్రయించినట్టు తెలుస్తోంది. ఏకంగా చిన్నారికి ఈ సంఖ్య ఉన్న  డ్రెస్ వేసి ఫొటో షూట్ నిర్వహించడంపై సామాజిక నిపుణుల్లోనూ ఆందోళన వ్యక్తమవుతోంది. ఇక ఈ కేసులో ఇప్పటివరకూ దర్శన్, అతడి గర్ల్‌ఫ్రెండ్ పవిత్ర గౌడ సహా మొత్తం 17 మందిని పోలీసులు అరెస్టు చేశారు.


More Telugu News