సినిమాల్లో నటించడంపై పిఠాపురంలో పవన్ కల్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు

  • సినిమాలు చేసే టైమ్ ఉంటుందంటారా? అన్న పవన్ కల్యాణ్
  • ఏపీ ప్రజలకు సేవ చేసుకునే అవకాశమివ్వాలని నిర్మాతలకు విజ్ఞప్తి
  • కొన్నిరోజులు షూటింగ్‌కు దూరంగా ఉంటానంటూ నిర్మాతలకు క్షమాపణ
  • ఓజీ చూద్దురుగానీ.. బాగుంటుందన్న పవన్ కల్యాణ్
సినిమాల్లో నటించడంపై ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు. పిఠాపురంలో నిర్వహించిన వారాహి సభ సందర్భంగా కొంతమంది అభిమానులు సినిమా గురించి అడిగారు. దీనిపై జనసేనాని స్పందించారు. 'సినిమాలు చేసే టైమ్ ఉంటుందంటారా? ఎలాగూ మాటిచ్చాం కాబట్టి ముందు ఒప్పుకున్న సినిమాలు చేయాలి. కానీ కనీసం గుంతలైనా పూడ్చకుండా సినిమాల కోసం వెళితే ప్రజలు నన్ను తిట్టుకుంటార'ని అన్నారు. 

తాను సినిమాలు చేయడానికి వెళ్తే... కనీసం కొత్త రోడ్లు వేయకున్నా, గుంతలు కూడా పూడ్చలేదని ప్రజలు తిడతారన్నారు. గెలిపించిన ప్రజలు తిట్టకుండా చూసుకోవాలి కదా అన్నారు. నేను 'ఓజీ... ఓజీ' అని వెళితే ప్రజలు తనను 'క్యాజీ' అని సమస్యలపై ప్రశ్నిస్తారని సరదాగా వ్యాఖ్యానించారు.

మా ఆంధ్ర ప్రజలకు కనీసం సేవ చేసుకునే అవకాశం ఇవ్వాలని ఆయన నిర్మాతలకు విజ్ఞప్తి చేశారు. మూడు నెలల పాటు సినిమాల షూటింగ్‌కు దూరంగా ఉంటానని చెప్పారు. వీలున్నప్పుడు రెండు మూడు రోజులు షూటింగ్ కోసం సమయం కేటాయిస్తానన్నారు. తన పనికి అంతరాయం కాకుండా ముందుకు సాగుతానన్నారు. నిర్మాతలకు ఆయన క్షమాపణలు చెప్పారు. 'ఓజీ చూద్దురుగానీ... బాగుంటుంద'ని అభిమానులను ఉద్దేశించి పవన్ నవ్వుతూ అన్నారు.


More Telugu News