కృష్ణా డెల్టాకు తాగు, సాగునీరు అందుతుందంటే అది పట్టిసీమ పుణ్యమే: మంత్రి నిమ్మల రామానాయుడు

  • పట్టిసీమ ఎత్తిపోతల ద్వారా గోదావరి జలాలను విడుదల చేసిన మంత్రి నిమ్మల
  • దేశాన్ని కరవు రహితంగా మార్చాలంటే నదుల అనుసంధానమే మార్గమని వ్యాఖ్య‌
  • గతంలో పట్టిసీమను జగన్‌ ఒట్టిసీమగా మార్చార‌ని ధ్వ‌జం
  • పోలవరం ప్రాజెక్టు పూర్తయితే వృథా నీటిని అరికట్టవచ్చన్న మంత్రి
పట్టిసీమ ఎత్తిపోతల పథకం ద్వారా కృష్ణా డెల్టాకు రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు నీటిని విడుదల చేశారు. మోటార్లు, యంత్రాలకు పూజలు చేసిన అనంతరం సాగు, తాగునీటిని ఆయ‌న విడిచిపెట్టారు. 4, 5, 6 పంపుల ద్వారా 1,050 క్యూసెక్కుల నీటిని వ‌దిలారు. ఈ కార్య‌క్ర‌మంలో మంత్రితో పాటు పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు, ఇతర నేతలు, అధికారులు పాల్గొన్నారు. 

ఈ సంద‌ర్భంగా మంత్రి నిమ్మ‌ల మాట్లాడుతూ.. దేశాన్ని కరవు రహితంగా మార్చాలంటే నదుల అనుసంధానమే మార్గమని, ఆ ప్రక్రియకు శ్రీకారం చుట్టింది సీఎం చంద్రబాబేనని అన్నారు. 5 ఏళ్ళ తరువాత గోదారమ్మ పరవళ్ళు తొక్కుకుంటూ, కృష్ణమ్మ వైపు పరుగులు పెడుతూ వస్తోంద‌ని తెలిపారు. పట్టిసీమ ద్వారా యేటా 80 టీఎంసీల నీటి వినియోగం జరుగుతోందన్నారు. గతంలో పట్టిసీమను జగన్‌ ఒట్టిసీమగా మార్చార‌ని దుయ్య‌బ‌ట్టారు. ఇప్పుడు అదే బంగారమైందన్నారు. 

కృష్ణా డెల్టాకు తాగు, సాగునీరు అందుతుందంటే అది పట్టిసీమ పుణ్యమేనని తెలిపారు. తాగునీటి వ్యవస్థను జగన్‌ విధ్వంసం చేశారని మంత్రి ఫైర్ అయ్యారు. పోలవరం ప్రాజెక్టు పూర్తయితే వృథా నీటిని అరికట్టవచ్చని చెప్పారు. ముంపు మండలాలను తెలంగాణ నుంచి ఆంధ్రాకు బదిలీ చేయించడం చంద్రబాబు ముందుచూపునకు నిదర్శనమని పేర్కొన్నారు. పోలవరం ఫలాలు పట్టిసీమ ద్వారా కొంతమేర కృష్ణా డెల్టాకు అందుతున్నాయని మంత్రి రామానాయుడు చెప్పుకొచ్చారు.


More Telugu News