బీఆర్ఎస్‌ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై కేసు.. కేటీఆర్ ఆగ్ర‌హం

  • ప్రభుత్వ అవినీతిని ప్రశ్నిస్తున్నందుకే కౌశిక్ రెడ్డిపై కేసు అన్న కేటీఆర్‌
  • ఇలాంటి బెదిరింపులకు బీఆర్ఎస్ నేత‌లు భయపడేది లేద‌ని వ్యాఖ్య‌
  • ప్ర‌జాస్వామ్యంలో ప్ర‌జాప్ర‌తినిధికి నిర‌స‌న తెలిపే హ‌క్కు లేదా? అంటూ ధ్వ‌జం
  • ప్ర‌తిప‌క్షాల నోరు మూయించేందుకు ఈ కేసుల‌న్న కేటీఆర్‌
బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై కేసు నమోదు చేయడం ప‌ట్ల‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ప్రభుత్వ అవినీతిని ప్రశ్నిస్తున్నందుకే ఆయనపై కేసు నమోదు చేశారని దుయ్య‌బట్టారు. ఇలాంటి బెదిరింపులకు బీఆర్ఎస్ నేత‌లు భయపడేది లేద‌న్నారు. 

'ప్రజా సమస్యలను జడ్పీ సమావేశంలో క‌లెక్ట‌ర్‌ దృష్టికి తీసుకెళ్లారు. కానీ, క‌లెక్ట‌ర్ స్పందించ‌క‌పోవ‌డంతో కౌశిక్ రెడ్డి నిర‌స‌న తెలిపే య‌త్నం చేశారు. ప్ర‌జాస్వామ్యంలో ప్ర‌జాప్ర‌తినిధికి నిర‌స‌న తెలిపే హ‌క్కు లేదా?' అని కేటీఆర్ ప్ర‌శ్నించారు. నిర‌స‌న తెల‌ప‌డం ఆయ‌న‌ చేసిన నేరమా? అని కేటీఆర్ నిల‌దీశారు. 

ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఫిర్యాదు చేసిన అంశాల‌పై ప్ర‌భుత్వం దృష్టిసారించ‌డంలేద‌ని కేటీఆర్ తెలిపారు. ప్ర‌తిప‌క్షాల నోరు మూయించాల‌నే కుట్ర‌తో ఇలా అక్ర‌మ కేసులు బనాయిస్తున్నారని మండిపడ్డారు. ప్ర‌భుత్వ పెద్ద‌ల ఒత్తిడితోనే ఎమ్మెల్యేపై కేసు పెట్టార‌ని ఆయ‌న‌ ఆరోపించారు. 

కౌశిక్ రెడ్డిపై కేసు నమోదు చేయటాన్ని తీవ్రంగా ఖండించిన కేటీఆర్.. దీన్ని దుర్మార్గ‌పూరిత చ‌ర్య‌గా పేర్కొన్నారు.  కౌశిక్ రెడ్డిపై కేసును వెంట‌నే ఉప‌సంహరించుకోవాల‌ని ఆయ‌న డిమాండ్ చేశారు.


More Telugu News