గేమింగ్ కోసం ఇంటర్నెట్ కేఫ్‌కు.. చనిపోయి 30 గంటలైనా గుర్తించని సిబ్బంది!

  • జూన్ 1న ఇంటర్నెట్ కేఫ్‌కు 29 ఏళ్ల వ్యక్తి
  • అతడి డెస్క్‌పై బ్రేక్‌ఫాస్ట్ చేసినట్టు ఆనవాళ్లు
  • 2న మధ్యాహ్నం లంచ్ చేయని వైనం
  • నిద్రపోతున్నాడనుకుని లేపని కేఫ్ సిబ్బంది
లాంగ్ గేమింగ్ సెషన్స్ కోసం ఇంటర్నెట్ కేఫ్‌కు వచ్చిన ఓ యువకుడు గేమ్ ఆడుతూనే ప్రాణాలు కోల్పోయాడు. ఆ తర్వాత 30 గంటలపాటు అలానే ఉన్నప్పటికీ కేఫ్‌ సిబ్బంది గుర్తించలేకపోయారు. అతడు నిద్రపోతున్నాడని అనుకున్నారు. చైనాలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

జూన్ 1న 29 ఏళ్ల వ్యక్తి లాంగ్ గేమింగ్ సెషన్స్ కోసం ఇంటర్నెట్ కేఫ్‌కు వచ్చాడు. ఆ తర్వాత 3న రాత్రి 10 గంటలకు కేఫ్‌ వర్కర్ ఒకరు పోలీసులకు ఫోన్ చేయడంతో అతడు చనిపోయిన విషయం వెలుగులోకి వచ్చింది. అతడు నిద్రపోతున్నాడనుకుని లేపేందుకు ప్రయత్నించిన వర్కర్ చేతిని తట్టడంతో శరీరం చల్లగా ఉన్నట్టు అనిపించింది. దీంతో అనుమానం వచ్చి చూడగా చనిపోయి కనిపించాడు. దీంతో వెంటనే అతడు పోలీసులకు సమాచారం అందించాడు.

అతడు బ్రేక్‌ఫాస్ట్ చేసినట్టు డెస్క్‌పై ఆనవాళ్లు ఉన్నాయి. జూన్ 2న అతడు లంచ్ కూడా చేయలేదు. అదే రోజు ఉదయం అతడు అకస్మాత్తుగా మరణించినట్టు పోలీసులు భావిస్తున్నారు. అతడు క్లోజ్‌డ్ రూములో కాకుండా ఓపెన్ ప్లేస్‌లో కూర్చున్నాడని, అతడు ఎంతకీ లేవకపోవడంతో చుట్టూ ఉన్నవాళ్లు, కేఫ్ సిబ్బంది సైతం ఆశ్చర్యపోయారని బాధితుడి బంధువు ఒకరు తెలిపారు.

అతడు రెగ్యులర్‌గా తమ కేఫ్‌ను సందర్శిస్తాడని, ప్రతిసారి ఆరు గంటలకుపైనే గడుపుతాడని కేఫ్ యజమాని తెలిపాడు. నిద్రపోతున్న కస్టమర్లను లేపితే తీవ్రంగా స్పందిస్తారన్న ఉద్దేశంతో తమ సిబ్బంది వారిని లేపరని పేర్కొన్నారు.

చైనాలో అకస్మాత్తు మరణాలు ఇటీవల బాగా పెరిగాయి. ఇటీవల జియాంగ్సు ప్రావిన్సులో 23 ఏళ్ల వలస కూలీ ఇలానే మరణించాడు. 2022లో బాస్కెట్‌బాల్ ఆడిన తర్వాత 19 ఏళ్ల కుర్రాడు కూల్‌డ్రింక్ తాగి కుప్పకూలి మరణించాడు. కాగా, తాజా ఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.


More Telugu News