జెట్ లాగ్ వల్ల ఆ రోజు స్టేజ్ పై నిద్ర ముంచుకొచ్చింది..: బైడెన్

  • తొలి డిబేట్ లో వైఫల్యంపై అమెరికా ప్రెసిడెంట్ వివరణ
  • ట్రంప్ తనపై పైచేయి సాధించడానికి కారణమదేనన్న బైడెన్
  • వరుస విదేశీ పర్యటనలతో జెట్ లాగ్ ఇబ్బంది పెట్టిందని వెల్లడి
అమెరికా అధ్యక్ష రేసులో భాగంగా జరిగిన తొలి డిబేట్ లో ప్రెసిడెంట్ బైడెన్ వెనకబడిన విషయం తెలిసిందే. అయితే, జెట్ లాగ్ వల్ల ఆ రోజు స్టేజ్ పై నిద్ర ముంచుకొచ్చిందని, అందువల్లే డిబేట్ లో సరిగా మాట్లాడలేకపోయానని బైడెన్ చెప్పారు. తాజాగా ఓ ఫండ్ రైజింగ్ కార్యక్రమంలో బైడెన్ మాట్లాడుతూ తన వైఫల్యానికి కారణం వివరించారు. ఓటమికి సాకులు చెప్పడం కాదుగానీ జరిగిన విషయం అందరికీ తెలియాలనే ఉద్దేశంతోనే వివరణ ఇస్తున్నానని పేర్కొన్నారు. ఇటీవల విరామం ఎరుగకుండా విదేశీ పర్యటనలు చేశానని బైడెన్ గుర్తుచేశారు. ఆ తర్వాత వెంటనే డిబేట్ లో పాల్గొనాల్సి రావడంవల్ల స్టేజ్ పై ఓ దశలో నిద్రపోయినంత పనైందని చెప్పుకొచ్చారు.

డిబేట్ లో ట్రంప్ పైచేయి సాధించడానికి ఇదే కారణమని వివరించారు. తొలి డిబేట్ జరగడానికి ముందు అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్ ఫ్రాన్స్, ఇటలీలలో పర్యటించి వచ్చారు. కాగా, బైడెన్ ఆరోగ్య పరిస్థితి అధ్యక్ష బాధ్యతల నిర్వహణకు సహకరించదని, అధ్యక్ష రేసులో నుంచి ఆయన తప్పుకోవడం మేలని చాలామంది అభిప్రాయపడుతున్నారు. ట్రంప్ తో డిబేట్ లో బైడెన్ తడబడడం ఈ ఆరోపణలకు ఊతమిచ్చింది. 81 ఏళ్లున్న బైడెన్ ఇటీవల పలు సందర్భాలలో విచిత్రంగా ప్రవర్తించడం తెలిసిందే. బైడెన్ తరచూ తనచుట్టూ ఉండే వ్యక్తుల పేర్లను, వ్యక్తులను మరిచిపోవడం, తనలో తానే మాట్లాడుకోవడం వంటి సంఘటనలు మీడియా ప్రముఖంగా ప్రచురించింది.

జీ 7 సదస్సులోనూ బైడెన్ విచిత్రంగా ప్రవర్తించారు. అయితే, ఈ ఆరోపణలను డెమోక్రాట్లు కొట్టిపారేస్తున్నారు. బైడెన్ పూర్తి ఆరోగ్యంగా ఉన్నారని, దేశాన్ని ముందుకు నడిపించే బాధ్యతను ఆయనే సరిగ్గా నిర్వర్తించగలరని చెబుతున్నారు. ఇక అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోని బ్లింకెన్ ఈ ఆరోపణలపై స్పందిస్తూ.. అధికార బాధ్యతలు చేపట్టాక బైడెన్ ఏంచేశారనేదే ప్రపంచం చూస్తోంది తప్ప కేవలం ఒక్క రాత్రి జరిగిన ప్రదర్శన కాదని డిబేట్ లో బైడెన్ వైఫల్యం పెద్దగా లెక్కలోకి రాదన్నట్లు వ్యాఖ్యానించారు.


More Telugu News