ప్రభాస్ కి ఎందుకంత క్రేజ్!

  • వసూళ్ల పరంగా దూసుకుపోతున్న 'కల్కి'
  • ప్రతి ప్రాంతంలోను కొత్త రికార్డుల నమోదు 
  • బాలీవుడ్ హీరోలను ఆలోచనలో పడేస్తున్న ప్రభాస్ 
  • అక్కడి హీరోలకు ఈ స్థాయి పోటీ ఎదురవుతున్నది ఇప్పుడే  

ప్రభాస్ .. ఇప్పుడు ఈ పేరు 'కల్కి 2898 AD' సినిమాను థియేటర్లలో పరుగులు తీయిస్తోంది. విడుదలైన ప్రతి ప్రాంతంలో కొత్త రికార్డులను నమోదు చేస్తోంది. ఎక్కడ చూసినా అందరూ ఈ సినిమాను గురించే మాట్లాడుకుంటున్నారు. ప్రభాస్ వరుసగా పాన్ ఇండియా సినిమాలు చేస్తూ, బాలీవుడ్ హీరోలను సైతం కొంతకాలంగా ఆలోచనలో పడేస్తూనే ఉన్నాడు .. ఆశ్ఛర్యపరుస్తూనే ఉన్నాడు. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ కి ఇంతపోటీ ఇచ్చిన హీరో ఇంతవరకూ లేడు అనడంలో అతిశయోక్తి లేదు. 

నిజానికి 'బాహుబలి 2' తరువాత ప్రభాస్ బడ్జెట్ పరంగా ఆ స్థాయి సినిమాలు చేశాడుగానీ, ఆ స్థాయి విజయాలను మాత్రం అందుకోలేదు. 'రాధే శ్యామ్' .. 'సాహో' .. 'సలార్' సినిమాలలో ఏదో ఒక వెలితి కనిపిస్తూనే వచ్చింది. ఇక 'ఆది పురుష్' అయితే అనేక విమర్శలను తెచ్చిపెట్టింది. అయినా ఆ సినిమాల టాక్, 'కల్కి' వసూళ్లపై ఎంతమాత్రం పడకపోవడం విశేషం. ప్రభాస్ సినిమాలను ఆడియన్స్ ఏ సినిమాకి ఆ సినిమాగానే చూస్తున్నారు. ఫ్లాప్ టాక్ వస్తే, తమ హీరోను సరిగ్గా చూపించలేకపోయారనీ .. ఆయనను సరిగ్గా ఉపయోగించుకోలేకపోయారని అంటున్నారే తప్ప, ఆ ఫ్లాప్ టాక్ ను ఆయన దరిదాపుల్లోకి రానీయకపోవడం విశేషం. ఇంతవరకూ ఏ హీరోకి ఇలాంటి ఒక అవకాశం దక్కలేదనే చెప్పాలి. నిజానికి 'కల్కి' సినిమాలో చెప్పుకోదగిన డైలాగ్స్ లేవు .. మాస్ ఆడియన్స్ ను హుషారెత్తించే రొమాన్స్ గానీ .. పాటలు గాని లేవు. అయినా ప్రతి థియేటర్ దగ్గర జనం జాతర కనిపిస్తోంది. 

కొన్నాళ్లుగా తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్లు నిద్రావస్థలో ఉన్నాయి .. బాక్సాఫీస్ బద్ధకంగా ముడుచుకుంది. అలాంటి సమయంలో వచ్చిన 'కల్కి' బాక్సాఫీస్ బద్ధకాన్ని వదిలించేస్తోంది. ప్రభాస్ కి ఈ స్థాయి క్రేజ్ రావడానికి వెనుక, హీరోయిజంతో కూడిన ఆయన కటౌట్ ప్రధాన కారణమని చెప్పాలి. ఇక రెండో స్థానంలో ఆయన వాయిస్ నిలుస్తుంది. కాస్త కరుకుగా .. విలన్ గుండెల్లో గుబులు పుట్టించేలా ఆయన డైలాగ్ డెలివరీ ఉంటుంది.

ప్రభాస్ పర్సనాలిటీ జానపదాలకు కరెక్టుగా సెట్ అవుతుందని 'బాహుబలి' నిరూపిస్తే, పౌరాణికాలకు కూడా సరిగ్గా సరిపోతాడనే విషయాన్ని 'ఆది పురుష్' స్పష్టం చేసింది. ఇక హీమ్యాన్ తరహా పాత్రలలోను మెప్పిస్తాడనే విషయాన్ని 'కల్కి' చాటి చెప్పింది. తాను ఏదో పొడిచేశానని అన్నట్టుగా ప్రభాస్ ఎక్కడా ఎప్పుడూ ప్రవర్తించకపోవడం, డాళింగ్ అంటూ ఆడియన్స్ లో కలిసి పోవడం ఆయనకి మరింత ప్లస్ అయింది. ప్రభాస్ పర్సనాలిటీ .. ఆయన నటన మాత్రమే కాదు, ఆయన వ్యక్తిత్వం కూడా ఈ స్థాయి క్రేజ్ కి ప్రధానమైన కారణమని చెప్పుకోవచ్చు.


More Telugu News