భార‌త్‌-శ్రీలంక‌లో 2026 టీ20 ప్ర‌పంచ‌క‌ప్.. ఇప్ప‌టికే ఎన్ని జ‌ట్లు అర్హ‌త సాధించాయంటే..!

  • 2026 టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌లో కూడా పాల్గొన‌నున్న‌ 20 జ‌ట్లు 
  • నాలుగు గ్రూపులుగా, సూప‌ర్‌-8, నాకౌట్ ఫార్మాట్‌లో టోర్నీ
  • భార‌త్‌, శ్రీలంక‌తో పాటు ఇప్ప‌టికే అర్హ‌త సాధించిన 12 జ‌ట్లు
  • మిగిలిన 8 జట్ల కోసం ప్ర‌పంచ‌వ్యాప్తంగా క్వాలిఫ‌యింగ్ టోర్నీలు
అమెరికా, వెస్టిండీస్ సంయుక్తంగా ఆతిథ్య‌మిచ్చిన టీ20 వ‌ర‌ల్డ్‌కప్ తొమ్మిదో ఎడిష‌న్ ముగిసింది. భార‌త జ‌ట్టు విజేత‌గా నిలిచింది. ఇక‌ త‌దుప‌రి ఎడిష‌న్‌ 2026లో భార‌త్‌-శ్రీలంక ఆతిథ్యంలో జ‌రుగుతుంద‌ని తాజాగా ఐసీసీ ప్ర‌క‌టించింది. ఫిబ్ర‌వ‌రి-మార్చిలో టోర్న‌మెంట్ జ‌ర‌గ‌నుంది. అలాగే 2026 టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌లో కూడా 20 జ‌ట్లు పాల్గొన‌నున్నాయి. నాలుగు గ్రూపులుగా, సూప‌ర్‌-8, నాకౌట్ ఫార్మాట్‌లో టోర్నీ ఉండ‌నుంది.  

2026 టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్‌కు ఇప్ప‌టికే అర్హత సాధించిన జట్లు ఇవే
ఆతిథ్య హోదాలో భార‌త్‌తో పాటు శ్రీలంక నేరుగా అర్హ‌త సాధించాయి. అలాగే టీ20 ప్రపంచ‌క‌ప్ 2024లో సూప‌ర్‌-8కు వెళ్లిన‌ ఆఫ్ఘనిస్థాన్, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా, అమెరికా, వెస్టిండీస్ కూడా అర్హ‌త సాధించాయి. 

ఇక జూన్ 30, 2024న న‌మోదైన ఐసీసీ ర్యాంకింగ్స్ ఆధారంగా పాకిస్థాన్, న్యూజిలాండ్, ఐర్లాండ్ నేరుగా క్వాలిఫై అయ్యాయి. ఇలా మొత్తంగా 12 జ‌ట్లు ఇప్ప‌టికే ఈ టోర్నీకి అర్హ‌త సాధించ‌డం జ‌రిగింది. 

మిగిలిన ఎనిమిది జట్ల కోసం ప్ర‌పంచ‌వ్యాప్తంగా క్వాలిఫ‌యింగ్ టోర్నీలు జ‌ర‌గ‌నున్నాయి. ఆఫ్రికా, ఆసియా, యూరప్‌లు ఒక్కొక్క‌టి రెండు చొప్పున‌ క్వాలిఫికేషన్ బెర్త్‌లను కలిగి ఉన్నాయి. అలాగే అమెరికా, తూర్పు-ఆసియా పసిఫిక్ ప్రాంతాలకు ఒక్కొక్కటి చొప్పున బెర్త్‌ల‌కు అవ‌కాశం ఉంది.


More Telugu News