రాహుల్ గాంధీ వెంటనే హిందువులకు క్షమాపణ చెప్పాలి: పురందేశ్వరి

  • లోక్ సభలో రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై దుమారం
  • ఎమర్జెన్సీ విధించి, సిక్కులను ఊచకోత కోసిన వారు సభలో నీతులు చెబుతున్నారన్న పురందేశ్వరి
  • రాహుల్ కోట్లాదిమంది హిందువుల మనోభావాలు దెబ్బతీశారంటూ విమర్శలు
ఇండియా కూటమి లోక్ సభా పక్ష నేత రాహుల్ గాంధీపై ఏపీ బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురందేశ్వరి ధ్వజమెత్తారు. లోక్ సభలో నిన్న రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను పురందేశ్వరి తప్పుబట్టారు. 

1975లో దేశవ్యాప్తంగా ఎమర్జెన్సీ విధించి రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీసిన వారు, వేలాది మంది సిక్కులను ఊచకోత కోసిన వారు పార్లమెంటులో నీతులు పలకడం హాస్యాస్పదంగా ఉందని విమర్శించారు. హిందువులు అందరూ అసత్యాలు పలుకుతారని, వారు హింసకు పాల్పడతారని రాహుల్ గాంధీ నిన్న లోక్ సభలో అన్నారని పురందేశ్వరి ఆరోపించారు. 

రాహుల్ వ్యాఖ్యలు దేశంలో హైందవ ధర్మాన్ని ఆచరిస్తున్న కోట్లాదిమంది హిందువుల మనోభావాలను దెబ్బతీశాయని విమర్శించారు. రాహుల్ గాంధీ వెంటనే దేశంలోని హిందువులందరికీ క్షమాపణలు చెప్పాలని పురందేశ్వరి డిమాండ్ చేశారు.


More Telugu News