పారిస్ లో మరో అరకు కాఫీ కేఫ్... ఆనంద్ మహీంద్రా ట్వీట్ పై సీఎం చంద్రబాబు స్పందన

  • ఇటీవల అరకు కాఫీ గురించి ట్వీట్ చేసిన ప్రధాని మోదీ
  • అరకు కాఫీ ప్రమోటర్స్ నాంది ఫౌండేషన్ కు బోర్డు చైర్మన్ గా వ్యవహరిస్తున్న ఆనంద్ మహీంద్రా
  • పారిస్ లో మరో అరకు కేఫ్ ప్రారంభిస్తున్నామని వెల్లడి
  • ఇది చాలా గొప్ప వార్త అంటూ ఏపీ సీఎం చంద్రబాబు హర్షం
ప్రధాని నరేంద్ర మోదీ కొన్ని రోజుల కిందట అరకు కాఫీ గురించి ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. 2016లో అప్పటి సీఎం చంద్రబాబుతో కలిసి అరకు కాఫీ  తాగుతున్న ఫొటోను మోదీ పంచుకున్నారు. దీనిపై ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా స్పందించారు. 

అరకు కాఫీని ప్రపంచవ్యాప్తం చేస్తున్న నాంది ఫౌండేషన్ కు ఆనంద్ మహీంద్రా బోర్డ్ చైర్మన్ గా ఉన్నారు. ప్రధాని మోదీ ట్వీట్ పై ఆయన ఏమన్నారంటే... అరకు కాఫీ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా పేరెన్నికగన్న బ్రాండ్ గా అవతరించిందని పేర్కొన్నారు. ఇప్పటికే తాము ఫ్రాన్స్ లోని పారిస్ లో అరకు కాఫీ కేఫ్ ను తెరిచామని, త్వరలోనే రెండో కేఫ్ ను కూడా ప్రారంభించబోతున్నామని తెలిపారు. 

అరకు కాఫీ ఉత్పాదన, బ్రాండ్ ఆవిర్భావంలో ఏపీ సీఎం చంద్రబాబు కృషి కూడా ఉందని ఆనంద్ మహీంద్రా కొనియాడారు. దీనిపై సీఎం చంద్రబాబు స్పందించారు. 

"పారిస్ లో మరొక అరకు కాఫీ కేఫ్... ఇది చాలా గొప్ప వార్త. అరకు కాఫీ తన స్థాయికి తగిన విధంగా అంతర్జాతీయంగా గుర్తింపు పొందుతూ ముందుకు వెళుతుండడం సంతోషం కలిగిస్తోంది. నాంది ఇండియా ఫౌండేషన్ కు చెందిన అరకునోమిక్స్, గిరిజన్ కోఆపరేటివ్ కార్పొరేషన్ చేయి చేయి కలిపి ఓ ఆలోచనకు వాస్తవరూపం కల్పించాయి. మన గిరిజన సోదరసోదరీమణుల జీవితాలను మార్చివేశాయి. ఆంధ్రప్రదేశ్ నుంచి భవిష్యత్తులో మరిన్ని విజయగాథలను వినాలని ఉంది" అంటూ చంద్రబాబు ట్వీట్ చేశారు.


More Telugu News