గాల్లో ఊగిపోయిన విమానం.. ప్రాణాలు అరచేతిలో పెట్టుకున్న 325 మంది ప్రయాణికులు.. తర్వాత జరిగింది ఇదీ!

  • మాడ్రిడ్ నుంచి మాంటెవీడియో వెళ్తున్న విమానం
  • ఎయిర్ టర్బులెన్స్‌కు గురై చిగురుటాకులా వణికిన విమానం
  • ఈశాన్య బ్రెజిల్‌లో అత్యవసరంగా ల్యాండింగ్
  • 40 మంది ప్రయాణికులకు గాయాలు
ఇటీవలి కాలంలో ఎయిర్ టర్బులెన్స్ (విమానంలో కుదుపులు) ఘటనలు తరచూ జరుగుతున్నాయి. తాజాగా నిన్న కూడా ఇలాంటి ఘటనే చోటుచేసుకోవడంతో విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేయాల్సి వచ్చింది. మాడ్రిడ్ నుంచి మాంటెవీడియో వెళ్తున్న ఎయిర్ యూరోపా విమానం భారీ కుదుపులకు గురైంది. దీంతో విమానాన్ని బ్రెజిల్‌లో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. 

బోయింగ్ 787-9 డ్రీమ్‌లైనర్ విమానమైన ఇందులో 325 మంది ప్రయాణికులున్నారు. గాలిలో ఒక్కసారిగా కుదుపులకు గురై ఊగిపోవడంతో ప్రయాణికులు హాహాకారాలు చేశారు. వస్తువులన్నీ చెల్లాచెదురుగా పడ్డాయి. దీంతో ఏమాత్రం ఆలస్యం చేయకుండా విమానాన్ని ఈశాన్య బ్రెజిల్‌లోని నాటల్ విమానాశ్రయానికి మళ్లించి సురక్షితంగా ల్యాండ్ చేశారు. అప్పటికే అక్కడ డజన్ల కొద్దీ అంబులెన్స్‌లు రెడీగా ఉన్నాయి.

కుదుపుల కారణంగా తీవ్రంగా గాయపడిన 40 మంది ప్రయాణికులను ఆసుపత్రికి తరలించారు. స్వల్పంగా గాయపడిన వారిని చికిత్స అనంతరం పంపించగా, తీవ్రంగా గాయపడినవారు ఇంకా ఆసుపత్రిలోనే ఉన్నారు. గాయపడిన వారిలో స్పెయిన్, అర్జెంటినా, ఉరుగ్వే, ఇజ్రాయెల్, బొలీవియా, జర్మనీ దేశాలకు చెందినవారున్నారు.     

ఈ ఏడాది మే నెలలో సింగపూర్ ఎయిర్‌లైన్స్ విమానం కూడా ఇలాగే ఎయిర్ టర్బులెన్స్‌కు గురైంది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన 73 ఏళ్ల బ్రిటిష్ జాతీయుడు మరణించాడు. ఆ తర్వాత వారానికే దోహా నుంచి ఐర్లాండ్ వెళ్తున్న ఖతర్ ఎయిర్‌వేస్ విమానం కూడా ఇలానే కుదుపులకు గురికావడంతో 12 మంది ప్రయాణికులు గాయపడ్డారు. ఎయిర్‌టర్బులెన్స్‌కు వాతావరణ మార్పులే కారణమని శాస్తవేత్తలు చెబుతున్నారు.


More Telugu News