కావ‌లిలో స్కూల్ బ‌స్సును ఢీకొట్టిన లారీ.. 15 మంది చిన్నారుల‌కు గాయాలు!

  • శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావ‌లిలో ఇవాళ‌ ఉద‌యం ఘ‌ట‌న‌ 
  • ప్ర‌మాదంలో చనిపోయిన క్లీన‌ర్ 
  • స‌మీపంలోని ఆసుప‌త్రుల‌కు గాయ‌ప‌డిన వారి త‌ర‌లింపు
  • ఆసుప‌త్రికి వెళ్లి చిన్నారుల‌ను ప‌రామ‌ర్శించిన ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి 
  • ప్ర‌మాదంపై 'ఎక్స్' వేదిక‌గా స్పందించిన మంత్రి నారా లోకేశ్ 
ఏపీలోని శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో మంగ‌ళవారం ఉద‌యం ఘోర రోడ్డు ప్ర‌మాదం జ‌రిగింది. కావలి వ‌ద్ద ఓ స్కూల్ బ‌స్సును లారీ ఢీకొట్టింది. ఈ ప్ర‌మాదంలో క్లీన‌ర్ చ‌నిపోగా, 15 మంది విద్యార్థుల‌కు గాయాల‌య్యాయి. దీంతో గాయ‌ప‌డిన వారిని వెంట‌నే స‌మీపంలోని ఆసుప‌త్రుల‌కు త‌ర‌లించి చికిత్స అందించారు. 

ప్ర‌మాదం గురించి తెలుసుకున్న కావ‌లి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ఆసుప‌త్రుల‌కు వెళ్లి చిన్నారుల‌ను, వారి త‌ల్లిదండ్రుల‌ను ప‌రామ‌ర్శించారు. బాధితుల‌ను అన్ని విధాలుగా ఆదుకుంటామ‌ని చెప్పిన ఎమ్మెల్యే.. మెరుగైన వైద్యం అందించాల‌ని అధికారుల‌ను ఆదేశించారు.    

ప్ర‌మాదంపై స్పందించిన మంత్రి నారా లోకేశ్
ఈ ప్ర‌మాదంపై మంత్రి నారా లోకేశ్ 'ఎక్స్' (ట్విట్ట‌ర్‌) వేదిక‌గా స్పందించారు. కావలి సమీపంలో పాఠశాల బస్సును లారీ ఢీకొన్న ఘటన తనను తీవ్ర ఆందోళనకు గురిచేసింద‌న్నారు. ప్రమాదంలో క్లీనర్ చనిపోవడం బాధాకరం అని పేర్కొన్నారు. ఈ ప్రమాదంలో గాయపడిన చిన్నారులకు తక్షణమే మెరుగైన వైద్యం అందించాల్సిందిగా అధికారులను ఆదేశించిన‌ట్లు తెలిపారు. స్కూలు యాజమాన్యాలు బస్సులన్నింటినీ కండిషన్‌లో ఉంచుకోవాలని సూచించారు. బస్సుల ఫిట్ నెస్ విషయంలో అత్యంత అప్రమత్తతతో వ్యవహరించాల్సిందిగా అధికారుల‌ను మంత్రి ఆదేశించారు.


More Telugu News