మ్యాచ్ మధ్యలో గుండెపోటు.. చైనా బ్యాడ్మింటన్ ప్లేయర్ మృతి.. వీడియో ఇదిగో!

  • ఇండోనేసియాలోని యోగ్యాకార్తాలో ఘటన
  • ఉన్నట్టుండి కోర్టులో కుప్పకూలిన ప్లేయర్
  • ఆసుపత్రికి తరలించేలోగానే మృతి   
ఇండోనేసియాలో బ్యాడ్మింటన్ టోర్నమెంట్ ఆడేందుకు వెళ్లిన చైనా ప్లేయర్ ఒకరు మ్యాచ్ మధ్యలోనే గుండెపోటుతో చనిపోయాడు. ఆడుతూనే కోర్టులో కుప్పకూలాడు. కాసేపు కాళ్లుచేతులు కొట్టుకున్న ప్లేయర్.. ఫిజియోలు స్పందించి ఆసుపత్రికి తరలించేలోగా ప్రాణం కోల్పోయాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. చనిపోయిన ప్లేయర్ ను చైనాకు చెందిన జాంగ్ జిజీగా గుర్తించారు. పదిహేడేళ్ల వయసులోనే జిజీ గుండెపోటుతో మరణించడం విచారకరమని భారత బ్యాడ్మింటన్ ప్లేయర్ పీవీ సింధు ట్విట్టర్ లో సంతాపం తెలిపారు. ప్రతిభావంతమైన ప్లేయర్ ను కోల్పోయామంటూ ఆసియా, ఇండోనేసియా బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఓ ప్రకటనలో విచారం వ్యక్తం చేసింది.

యోగ్యాకార్తలో జరుగుతున్న ఆసియా జూనియర్ బ్యాడ్మింటన్ మిక్స్ డ్ పోటీలలో చైనాకు చెందిన ప్లేయర్ జాంగ్ జిజీ పాల్గొన్నాడు. జపాన్ ప్లేయర్ కజుమా కవానోతో జరుగుతున్న మ్యాచ్ లో జిజీ కుప్పకూలాడు. అకస్మాత్తుగా జరిగిన ఈ ఘటనపై రిఫరీ స్పందించేందుకు కాస్త ఆలస్యం జరిగింది. ఫిజియోలను పిలవగా వారు వచ్చి జిజీని పరీక్షించారు. ఆపై జిజీని ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే జిజీ ప్రాణాలు కోల్పోయాడని వైద్యులు ప్రకటించారు. జాంగ్ జిజీ గతేడాదే చైనా జూనియర్ జట్టులో చేరాడని అతడి సహచరులు చెప్పారు. అంతలోనే జిజీ ఆకస్మికంగా మరణించడంతో ఆయన అభిమానుల్లో విషాదం నెలకొంది.


More Telugu News