రూ. 8,300 కోట్ల మోసం కేసులో భారతీయ అమెరికన్ కు ఏడున్నరేళ్ల జైలుశిక్ష

  • కార్పొరేట్ కంపెనీలను మోసగించినందుకు రిషీ షాను దోషిగా తేల్చిన న్యాయస్థానం
  • సొంత సంస్థ ఔట్ కమ్ హెల్త్ ఆర్థిక పరిస్థితి గురించి పెట్టుబడిదారులను తప్పుదోవ పట్టించినట్లు నిర్ధారణ
  • ఇందుకు సహకరించిన సంస్థలోని మరో ఇద్దరికి కూడా జైలు శిక్షలు విధించిన కోర్టు
ప్రముఖ భారతీయ అమెరికన్ వ్యాపారవేత్త, ఔట్ కమ్ హెల్త్ సహ వ్యవస్థాపకుడు రిషీ షా (38)కు అమెరికాలోని కోర్టు ఏడున్నరేళ్ల జైలు శిక్ష విధించింది. రూ. 8,300 కోట్ల (ఒక బిలియన్ డాలర్లు) మేర వివిధ కంపెనీలను మోసగించిన కేసులో కోర్టు ఆయన్ను దోషిగా తేల్చింది. అమెరికా చరిత్రలో ఇటీవలి కాలంలో అతిపెద్ద కార్పొరేట్ నేరాల్లో ఇది ఒకటిగా నిలవడం గమనార్హం.

బ్లూమ్ బర్గ్ నివేదిక ప్రకారం 2006లో కాంటెక్ట్స్ మీడియా హెల్త్ పేరిట షా ఒక కంపెనీని నెలకొల్పాడు. ఆ తర్వాత దాన్ని ఔట్ కమ్ హెల్త్ పేరిట మార్చాడు. వైద్యం కోసం డాక్టర్ల వద్దకు వచ్చే రోగులను ఆకర్షించేలా ఆరోగ్య రంగానికి సంబంధించిన టీవీ ప్రకటనలను ప్రచారం చేయాలనేది అతని బిజినెస్ ప్లాన్. ఇందుకోసం డాక్టర్ల ఆఫీసుల్లో టీవీలను ఏర్పాటు చేయాలనేది ప్రణాళిక. ఈ ఆలోచన నచ్చడంతో శ్రద్ధా అగర్వాల్ అనే మహిళ ఈ సంస్థలో సహ భాగస్వామిగా మారింది. 2010 తొలినాళ్ల నాటికి ఔట్ కమ్ హెల్త్.. వైద్య పెట్టుబడుల రంగంలో బడా సంస్థగా ఆవిర్భవించింది. దీంతో పెద్దపెద్ద కార్పొరేట్ సంస్థలు ఔట్ కమ్ హెల్త్ లో భారీ స్థాయిలో పెట్టుబడులు పెట్టాయి. దీంతో షికాగోలో రిషీ షా ఓ దిగ్గజంగా ఎదిగాడు.

కానీ క్రమంగా వ్యాపారం దెబ్బతినడంతో షా, అగర్వాల్, కంపెనీ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ బ్రాడ్ పర్డీ పెట్టుబడిదారులను మోసం చేయడం మొదలుపెట్టారు. సంస్థ కార్యకలాపాలు, ఆర్థిక పరిస్థితి గురించి దొంగ లెక్కలను పెట్టుబడిదారులు, క్లయింట్లు, రుణదాతలకు చూపుతూ వారిని తప్పుదోవ పట్టించారు. సంస్థ సామర్థ్యంకన్నా ఎక్కువ వ్యాపారం చేస్తున్నట్లు తప్పుడు గణాంకాలు రూపొందించారు. అందుకు అనుగుణంగా వ్యాపారాన్ని విస్తరించాల్సి ఉందంటూ ఫార్మా దిగ్గజ సంస్థ నోవో నోర్డిస్క్ ఏఎస్ తోపాటు ఇతర సంస్థల నుంచి భారీగా పెట్టుబడులు సమీకరించారు. ఇలా పొందిన డబ్బుతో షా విలాసాలకు అలవాటుపడ్డాడు. ప్రైవేటు జెట్ విమానాలు, పడవుల్లో విదేశీ టూర్లకు వెళ్లడం, 10 లక్షల డాలర్లతో ఇల్లు కొనుక్కోవడం వంటివి చేశాడు. ఈ తప్పుడు లెక్కల ఆధారంగా 2016లో అతని నికర ఆస్తుల విలువ 4 బిలియన్ డాలర్లకు చేరుకుంది. కానీ 2017లో షా మోసాలను మీడియా బయటపెట్టడంతో అతని పతనం ప్రారంభమైంది.

దీంతో గోల్డ్ మన్ శాచ్స్, ఆల్ఫాబెట్ లాంటి బడా కార్పొరేట్ సంస్థలు షా, అగర్వాల్ పై కోర్టులో కేసులు వేశాయి. 487.5 మిలియన్ డాలర్ల ఫండ్ రైజింగ్ ద్వారా వారిద్దరూ 225 మిలియన్ డాలర్ల డివిడెండ్ పొందారని.. కానీ సంస్థ మాత్రం తీవ్ర నష్టాలు మూటకట్టుకుందని పేర్కొన్నాయి. దీనిపై సుదీర్ఘ విచారణ అనంతరం మనీలాండరింగ్ సహా మరికొన్ని అభియోగాల కింద షాను 2023 ఏప్రిల్ లో కోర్టు దోషిగా తేల్చింది. షాకు 15 ఏళ్ల జైలు శిక్ష, అగర్వాల్, పర్డీలకు చెరో పదేళ్ల శిక్ష విధించాలని పిటిషనర్లు కోర్టును కోరారు. కానీ కోర్టు మాత్రం అగర్వాల్ కు మూడేళ్లు, పర్డీకి రెండేళ్ల జైలు శిక్ష విధించింది. తాజాగా షాకు ఏడున్నరేళ్ల శిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది. కోర్టులో తన నేరాన్ని అంగీకరించిన షా.. అందుకు తాను పశ్చాత్తాప పడుతున్నట్లు చెప్పాడు. తప్పుడు పద్ధతులతో పెట్టుబడిదారులను మోసగించినట్లు సిగ్గుపడుతున్నానని పేర్కొన్నాడు.


More Telugu News