నాలుగేళ్ల తర్వాత ఆస్ట్రేలియా నుంచి ఇంటికి బయల్దేరిన పంజాబ్ యువతి.. విమానం ఎక్కీ ఎక్కగానే మృతి

  • మెల్‌బోర్న్‌లో నాలుగేళ్లుగా చెఫ్ శిక్షణ పొందుతున్న మన్‌ప్రీత్ కౌర్
  • గత నెల 20న ఢిల్లీ వెళ్లేందుకు క్వాంటాస్ విమానం ఎక్కిన యువతి
  • సీటుబెల్టు పెట్టుకుంటుండగా కిందపడి మృతి
నాలుగేళ్ల తర్వాత ఆస్ట్రేలియా నుంచి భారత్‌కు బయలుదేరిన యువతి విమానం ఎక్కీ ఎక్కగానే ప్రాణాలు కోల్పోయింది. ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌లో జూన్ 20న జరిగిందీ విషాద ఘటన. పంజాబ్‌కు చెందిన 24 ఏళ్ల మన్‌ప్రీత్ కౌర్ చెఫ్ కావాలన్న ఉద్దేశంతో నాలుగేళ్లుగా మెల్‌బోర్న్‌లో శిక్షణ పొందుతోంది. 

కుటుంబ సభ్యులను చూసేందుకు గత నెల 20న భారత్ బయలుదేరింది. తుల్లామెరైన్ విమానాశ్రయంలో ఢిల్లీ వెళ్లేందుకు క్వాంటాస్ విమానం ఎక్కింది. అయితే, సీటుబెల్ట్ పెట్టుకుంటుండంగా ఒక్కసారిగా కిందపడి అక్కడికక్కడే మరణించింది. వెంటనే స్పందించిన విమానంలోని అత్యవసర సిబ్బంది ఆమెను కాపాడే ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది.  

ఆమె బహుశా టీబీతో చనిపోయి ఉండొచ్చని క్వాంటాస్ అధికార ప్రతినిధి తెలిపారు. మన్‌ప్రీత్ మరణంతో ఆమె కుటుంబాన్ని ఆదుకునేందుకు స్నేహితులు ‘గో ఫండ్ మీ’లో నిధుల సేకరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. దీనికి అనూహ్య స్పందన లభించింది. 30 వేల డాలర్లు సేకరించాలని లక్ష్యంగా పెట్టుకోగా ఐదు రోజుల్లోనే 670 మంది దాతలు 25 వేల డాలర్ల సాయం అందించారు.


More Telugu News