దైవ ప్రార్థన ఫలితం.. మరణ శిక్ష కాస్తా యావజ్జీవం.. ఒరిస్సా హైకోర్టు తీర్పు

  • ఆరేళ్ల బాలికపై అత్యాచారం చేసి చంపేసిన నేరస్థుడికి శిక్ష తగ్గింపు
  • దేవుడి ముందు లొంగిపోయాడని వ్యాఖ్యానించిన ధర్మాసనం
  • బాధిత కుటుంబానికి పరిహారం పెంచుతూ ఆదేశాలు
ఆరేళ్ల బాలికపై అత్యాచారం చేసి, హత్య చేసిన నేరస్థుడికి ఒరిస్సా హైకోర్టు శిక్ష తగ్గించింది.. ఇప్పటికే జైలులో ఉన్న సదరు నిందితుడు ప్రతిరోజూ దైవ ప్రార్థన చేస్తున్నాడనే కారణంతో మరణ శిక్షను యావజ్జీవ ఖైదుకు మార్చింది. ఈమేరకు ఒరిస్సా హైకోర్టు తీర్పు వెలువరించింది. ఈ కేసు వివరాలు.. ఒడిశాకు చెందిన ఎస్ కే ఆసిఫ్ అలీ ఓ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆపై చిన్నారిని దారుణంగా చంపేశాడు. ఆసిఫ్ అలీని పోలీసులు అరెస్టు చేసి జగత్ సింగ్ పూర్ లోని పోక్సో కోర్టులో హాజరుపరిచారు. కేసు విచారించిన పోక్సో కోర్టు.. దీనిని అత్యంత అమానుషమైన నేరంగా పరిగణిస్తూ ఆసిఫ్ అలీకి మరణ శిక్ష విధించింది.

దీనిపై నిందితుడు ఒరిస్సా హైకోర్టును ఆశ్రయించాడు. సుదీర్ఘంగా విచారించిన హైకోర్టు ధర్మాసనం.. ఈ కేసులో దోషిగా తేలిన ఆసిఫ్ అలీ జైలులో రోజూ దైవ ప్రార్థన చేస్తున్న విషయం తమ దృష్టికి వచ్చిందని, దేవుడి ముందు అలీ లొంగిపోయాడని వ్యాఖ్యానించింది. తాను చేసిన నేరాన్ని దేవుడి ముందు అంగీకరించేందుకు సిద్ధంగా ఉన్నాడని పేర్కొంది. దీంతో ఆసిఫ్ అలీకి విధించిన మరణ శిక్షను యావజ్జీవ ఖైదుగా మారుస్తున్నట్లు తీర్పు వెలువరించింది. దీంతో పాటు బాధిత బాలిక కుటుంబానికి పోక్సో కోర్టు ప్రకటించిన రూ. 1.50 లక్షల పరిహారాన్ని రూ.10 లక్షలకు పెంచింది. ఈ మొత్తం ఆసిఫ్ అలీ కుటుంబం చెల్లించాలని ఆదేశించింది.


More Telugu News