యూపీఐ యాప్‌లపై తెలంగాణ విద్యుత్ బిల్లుల చెల్లింపుల బంద్

  • అధికారిక వెబ్‌సైట్, యాప్‌లలో మాత్రమే చెల్లించాలన్న టీజీఎస్‌పీడీఎల్
  • జులై 1 నుంచి అన్ని చెల్లింపు గేట్‌వేలు, బ్యాంకుల ద్వారా చెల్లింపుల నిలిపివేత
  • టీజీఎస్‌పీడీసీఎల్ కీలక ప్రకటన

తెలంగాణ విద్యుత్ వినియోగ సంస్థలు టీజీఎస్‌పీడీసీఎల్, టీజీఎన్‌పీడీసీఎల్ కీలక ప్రకటన చేశాయి. నెలవారీ విద్యుత్ బిల్లులను తమ అధికారిక వెబ్‌సైట్, యాప్‌లపై మాత్రమే చెల్లించాలని సూచించాయి. ఈ మేరకు అన్ని చెల్లింపు గేట్‌వేలు, బ్యాంకుల ద్వారా చెల్లింపులను జులై 1 నుంచి నిలిపివేసినట్టు టీజీఎస్‌పీడీసీఎల్ ప్రకటించింది.

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు వివరణ ఇచ్చారు. దేశవ్యాప్తంగా అన్ని విద్యుత్ సంస్థలకు ఆర్బీఐ కీలక ఆదేశాలు ఇచ్చినట్టు పేర్కొన్నారు. దీంతో ఇకపై తెలంగాణ విద్యుత్ వినియోగదారులు ఫోన్‌పే, పేటీఎం, అమెజాన్‌పే, గూగుల్‌ వంటి చెల్లింపు గేట్‌వేల ద్వారా కరెంట్ బిల్లులు చెల్లించడం సాధ్యపడదు. 

కాగా యూపీఐ యాప్‌ల ద్వారా కరెంట్ బిల్లుల చెల్లింపు పట్టణ ప్రాంతాల్లో గణనీయంగా ఉందని, కొన్నేళ్లుగా తమ నెలవారీ కరెంట్ బిల్లులను చెల్లించేందుకు వినియోగదారులు చెల్లింపు గేట్‌వేలను ఉపయోగిస్తున్నట్లు అధికారులు చెప్పారు. కాగా సోషల్ మీడియా వేదికగా చేసిన ఈ ప్రకటనపై పలువురు వినియోగదారులు అసంతృప్తి వ్యక్తం చేశారు. కఠినమైన నిర్ణయం తీసుకున్నారని వ్యాఖ్యానించారు. ‘డిజిటల్ ఇండియా’ లక్ష్యంలో ఒక అడుగు వెనక్కి వేశారంటూ పలువురు వినియోగదారులు వ్యాఖ్యానించారు. ఐఫోన్ వినియోగదారులకు కరెంట్ బిల్లుల చెల్లింపునకు ఒక్క యాప్ కూడా అందుబాటులో లేదని పలువురు యూజర్లు పేర్కొన్నారు. బీబీపీఎస్ (భారత్ బిల్ పేమెంట్ సిస్టమ్) ద్వారా కరెంట్ బిల్లు చెల్లింపులకు అవకాశం ఇవ్వాలని పలువురు సూచించారు.


More Telugu News