పోలీసులతో మంత్రి రాంప్రసాద్ భార్య వ్యవహరించిన తీరుపై సీఎం చంద్రబాబు ఆగ్రహం

  • పోలీసులతో దురుసుగా మాట్లాడిన మంత్రి రాంప్రసాద్ అర్ధాంగి హరితారెడ్డి
  • మంత్రి భార్య పోలీసులతో మాట్లాడిన తీరు సరికాదన్న సీఎం చంద్రబాబు
  • మరోసారి ఇలా జరిగితే ఉపేక్షించేది లేదంటూ హెచ్చరిక
  • భార్య ప్రవర్తన పట్ల విచారం వ్యక్తం చేసిన మంత్రి రాంప్రసాద్ రెడ్డి
ఏపీ రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి భార్య హరితారెడ్డి పోలీసులతో వ్యవహరించిన తీరు, ఆమె మాట్లాడిన విధానం సర్వత్రా విమర్శలకు దారితీసింది. రాయచోటిలో తనకు పోలీసులు ఎస్కార్ట్ గా రావాలని, పోలీసుల కోసం ఎంత సేపు వేచి చూడాలని ఆమె ఓ పోలీసు అధికారిపై చిందులు తొక్కారు. 

దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి భార్య పోలీసులతో మాట్లాడిన తీరు సరికాదని పేర్కొన్నారు. పోలీసులు, అధికారులు, ఇతర ఉద్యోగుల పట్ల ప్రతి ఒక్కరూ గౌరవభావంతో మెలగాలని, ప్రభుత్వానికి అప్రదిష్ఠ తెచ్చేలా వ్యవహరిస్తే సహించలేది లేదని చంద్రబాబు స్పష్టం చేశారు. 

కాగా, ఈ ఘటనపై మంత్రి రాంప్రసాద్ రెడ్డి స్పందించారు. తన భార్య హరితారెడ్డి పోలీసులతో వ్యవహరించిన తీరు పట్ల ఆయన విచారం వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలు మరోసారి జరగకుండా చూసుకుంటానని హామీ ఇచ్చారు. 


More Telugu News