ఇవాళ అన్ని పండుగలు ఒకేసారి జరిగినంత ఆనందం కనిపిస్తోంది: ఏలూరి సాంబశివరావు

  • ఏపీలో నేడు పెంచిన పెన్షన్ల పంపిణీ
  • ఏప్రిల్ నుంచి పెంపును కూడా కలిపి రూ.7 వేలు అందించిన చంద్రబాబు సర్కారు
  • ఇక జగన్ మాటలు ప్రజలు నమ్మే ప్రసక్తే లేదన్న ఏలూరి సాంబశివరావు
రాష్ట్రంలో పెన్షన్ల పంపిణీ సందర్భంగా నేడు పండుగ వాతావరణం నెలకొందని... గత నెల 4న నరకాసుర వధ జరిగినట్టు భావించి ప్రజలు పండుగ జరుపుకుంటే... నేడు అన్ని పండుగలు ఒకేసారి వచ్చినంత ఆనందం కనిపిస్తుందని పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు అన్నారు. మంగళగిరి టీడీపీ జాతీయ ప్రధాన కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. 

చంద్రబాబునాయుడు ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ రూ.7,000 పెన్షన్ అందించారని వెల్లడించారు. నాడు రాజకీయ లబ్ధి కోసం జగన్ పండుటాకులను ఇబ్బంది పెట్టారని విమర్శించారు. రాష్ట్రంలో 65 లక్ష మంది పింఛన్ దారులకు ఒకేసారి రూ. 7000ల చొప్పున పెన్షన్ ఇచ్చామని... వితంతువులు, వికలాంగులతో పాటు అన్ని రకాల పింఛన్లు ఇవ్వడం దేశ చరిత్రలో అరుదైన రికార్డు అని ఏలూరి సాంబశివరావు వివరించారు. 

ఆనాడు జగన్ రెడ్డి రూ. 2000 ఉన్న పింఛన్ ను మూడు వేలు చేస్తానని చెప్పి రెండేళ్లకు ఒకసారి రూ.250 పెంచుతూ... పింఛన్ దారులను మోసం చేశాడని మండిపడ్డారు. 

"పింఛన్ ఇచ్చేందుకు అవకాశం ఉన్నా దాన్ని ఉపయోగించుకోకుండా... మండుటెండలో వృద్ధులను హింసించి సానుభూతి పొందాలని చూశారు. మండుటెండలో 60 మంది పండుటాకుల ప్రాణాలు తీశారు. దాన్ని ప్రజలు ఛీత్కరించారు. అందుకే ఎన్నికల్లో గుణపాఠం చెప్పారు. నేడు ఉదయం 6 గంటలకు మొదలు పెట్టి నూటికి 80 శాతం పింఛన్ లు ఇప్పటికే వారి ఇంటి వద్దకు వెళ్లి అందించిన సమర్థ నాయకుడు చంద్రబాబు. 

ఒక పండుగ వాతావరణంలో నేడు పింఛన్ల పంపిణీ చేయడం దేశ చరిత్రలో ఎప్పుడూ లేదు. జగన్ రెడ్డి హిమాలయాలకు వెళ్లి తపస్సు చేసినా కూడా తాను చేసిన పాపాలకు పరిస్కారం లేదు. నేడు ఆయన వేదాంతం మాట్లాడుతున్నాడు. చేయాల్సింది అంతా చేసి నంగనాచి కబుర్లు చెబుతున్నాడు. ఇలాంటి మోసపూరిత మాటలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదు" అని ఏలూరు సాంబశివరావు స్పష్టం చేశారు.


More Telugu News