లడఖ్ లో చనిపోయిన తెలుగు జవాన్ల కుటుంబాలకు రూ.1 కోటి చొప్పున ఇవ్వాలి: జగన్

  • లడఖ్ లో ఆకస్మిక వరదలతో నదిలో కొట్టుకుపోయిన యుద్ధ ట్యాంకు
  • శిక్షణ పొందుతున్న ఐదుగురు జవాన్ల మరణం
  • మృతుల్లో ముగ్గురు ఏపీకి చెందిన జవాన్లు
లడఖ్ లో శిక్షణలో భాగంగా ఓ యుద్ధ ట్యాంకుతో నదిని దాటే విన్యాసాలు చేపడుతున్న భారత జవాన్లు ఆకస్మిక వరద కారణంగా మృత్యువాత పడడం తెలిసిందే. ఈ ఘటనలో ఐదుగురు జవాన్లు మరణించారు. వీరిలో ముగ్గురు ఏపీకి చెందిన జవాన్లు ఉన్నారు. దీనిపై ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్ స్పందించారు. 

లడఖ్ లో యుద్ధ ట్యాంకు నదిలో కొట్టుకుపోయిన ప్రమాదంలో జవాన్లు మరణించడం తనను తీవ్రంగా కలచివేసిందని పేర్కొన్నారు. దేశ రక్షణ కోసం జవాన్ల త్యాగాలు మరువలేనివని తెలిపారు. మరణించిన జవాన్లలో కృష్ణా జిల్లాకు చెందిన సాదరబోయిన నాగరాజు, ప్రకాశం జిల్లాకు చెందిన ముత్తుమల రామకృష్ణారెడ్డి, బాపట్ల జిల్లాకు చెందిన సుభాన్ ఖాన్ ఉండడం బాధాకరమని జగన్ వెల్లడించారు. 

"మృతి చెందిన జవాన్లకు నివాళులు అర్పిస్తున్నాను. వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. ప్రమాదంలో అసువులు బాసిన తెలుగు జవాన్ల కుటుంబాలకు రూ.1 కోటి చొప్పున ఆర్థిక సహాయం అందించి ఆదుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను" అంటూ జగన్ ట్వీట్ చేశారు.


More Telugu News