లోక్ సభలో రాహుల్ గాంధీ ప్రసంగంపై అభ్యంతరం తెలిపిన ప్రధాని మోదీ, అమిత్ షా

  • లోక్ సభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ
  • వాడీవేడిగా ప్రసంగించిన రాహుల్ గాంధీ
  • ప్రధాని మోదీ నుంచి ఒక చిరునవ్వును కూడా ఆశించలేమని వ్యాఖ్యలు
  • విపక్ష నేతతో అత్యంత సీరియస్ గా ఉండాలన్న విషయాన్ని రాజ్యాంగం నేర్పిందన్న మోదీ
  • అగ్నివీర్ లకు రాహుల్ క్షమాపణలు చెప్పాలంటూ అమిత్ షా డిమాండ్
లోక్ సభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు చెప్పే తీర్మానంపై చర్చ సందర్భంగా విపక్ష నేత రాహుల్ గాంధీ ఎన్డీయే సర్కారుపై నిప్పులు చెరిగారు. పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ, అయోధ్య, నీట్, భూసమీకరణ, సైన్యంలో అగ్నివీర్ నియామకాలు... ఇలా అనేక అంశాలపై కేంద్ర ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు. 

సత్యమేవ జయతే అంటారు... నిజం మాట్లాడితే భయపడతారు అంటూ ఎద్దేవా చేశారు. ప్రజల సమస్యల గురించి మాట్లాడితే ఈ ప్రభుత్వం భయపడుతోందని విమర్శించారు. స్పీకర్ నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని, మాట్లాడేందుకు ప్రతిపక్ష సభ్యులకు కూడా అవకాశం ఇవ్వాలని అన్నారు. 

ప్రధాని మోదీ కనీసం విపక్ష నేతను మర్యాదపూర్వకంగా అయినా పలకరించరు, ఆయన నుంచి ఒక చిరునవ్వును కూడా ఆశించలేం అని రాహుల్  గాంధీ వ్యాఖ్యానించారు. 

రాహుల్ గాంధీ వ్యాఖ్యల పట్ల ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. విపక్ష నేతతో అత్యంత సీరియస్ గా ఉండాలన్న విషయాన్ని నాకు రాజ్యాంగం నేర్పించింది అని బదులిచ్చారు. అంతేకాదు, రాహుల్ పలు అంశాలపై చేసిన ఆరోపణల పట్ల మోదీ అభ్యంతరం వ్యక్తం చేశారు. 

కేంద్ర హోం మంత్రి అమిత్ షా కూడా రాహుల్ వ్యాఖ్యలను తప్పుబట్టారు. అగ్నివీర్ లకు అందే సాయంపై అబద్ధాలు చెప్పకూడదని అన్నారు. అగ్నివీర్ లకు రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలని అమిత్ షా డిమాండ్ చేశారు.


More Telugu News