ఆర్‌సీబీలోకి దినేశ్ కార్తీక్ రీఎంట్రీ.. కోచ్‌గా బాధ్యతలు!

  • డీకేను జట్టు బ్యాటింగ్ కోచ్, మెంటార్‌గా నియమించిన బెంగ‌ళూరు
  • ఈ మేర‌కు ఎక్స్ వేదిక‌గా ఆర్‌సీబీ కీల‌క ప్ర‌క‌ట‌న 
  • 2024 ఐపీఎల్ సీజన్లోనే క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన దినేశ్ కార్తీక్‌
  • త‌న‌ ఐపీఎల్ కెరీర్‌లో మొత్తం ఆరు జట్లకు డీకే ప్రాతినిధ్యం
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) 2025 ఐపీఎల్ కోసం జట్టులో కీల‌క మార్పులకు శ్రీకారం చుట్టింది. ఈ క్రమంలో మాజీ ప్లేయర్ దినేశ్ కార్తీక్‌ను జట్టు బ్యాటింగ్ కోచ్, మెంటార్‌గా నియమిస్తున్నట్లు సోమవారం ప్రకటించింది. ఈ మేర‌కు ఎక్స్ (ట్విట్ట‌ర్‌) వేదిక‌గా కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది.

''మా వికెట్‌కీపర్‌కు మళ్లీ జట్టులోకి స్వాగతం. దినేశ్ కార్తీక్‌ను కొత్త అవతారంతో చూడ‌బోతున్నారు. ఆర్‌సీబీ మెన్స్ టీమ్‌కు బ్యాటింగ్ కోచ్‌గా, మెంటార్‌గా బాధ్యతలు అందుకోనున్నాడు. క్రికెట్‌ నుంచి అతన్ని వేరు చేయొచ్చు. కానీ అతని నుంచి క్రికెట్ దూరం కాదు. అతడు మా జట్టులో 12వ మెంబర్'' అని ఆర్‌సీబీ సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. 

ఇక ఐపీఎల్‌లో అతనికి ఉన్న అనుభవం, బెంగ‌ళూరు జట్టుపై ఉన్న అవగాహనతో డీకేను ఆర్‌సీబీ తిరిగి తమ గూటికి తీసుకువచ్చింది. కాగా, 39 ఏళ్ల డీకే 2024 ఐపీఎల్ సీజన్లోనే క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన‌ విష‌యం తెలిసిందే. జూన్ 1న డీకే రిటైర్మెంట్ ప్రకటించాడు. ఐపీఎల్ 17వ సీజ‌న్‌లో అతను 15 మ్యాచ్‌లలో 36.22 సగటు, 187.35 స్ట్రైక్ రేట్‌తో 326 పరుగులు చేశాడు. ఇందులో 2 అర్ధ సెంచరీలు ఉండ‌గా.. అత్యధిక వ్య‌క్తిగ‌త స్కోర్ 83 ర‌న్స్. 

ఇదిలాఉంటే.. దినేశ్‌ కార్తీక్ త‌న‌ ఐపీఎల్ కెరీర్‌లో మొత్తం ఆరు జట్లకు ప్రాతినిధ్యం వ‌హించాడు. ఢిల్లీ డేర్ డెవిల్స్ (2008-14), కింగ్స్ XI పంజాబ్ (ప్రస్తుతం పంజాబ్ కింగ్స్ - 2011), ముంబై ఇండియన్స్ (2012-13), గుజరాత్ లయన్స్ (2016-17), కోల్‌కతా నైట్ రైడర్స్ (2018) -21), రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు (2015, 2022-24).

మొత్తంగా 256 మ్యాచ్‌లలో డీకే 22 హాఫ్ సెంచరీలతో 135 కంటే ఎక్కువ స్ట్రైక్ రేట్‌, 26 సగటుతో 4,816 పరుగులు చేశాడు. ఇక కీపర్‌గా కార్తీక్ ఓవరాల్ అవుట్‌లలో (172) పాలుపంచుకున్నాడు. ఇందులో 36 స్టంపింగ్‌లు ఉన్నాయి. అత్య‌ధిక స్టంపౌట్ చేసిన వికెట్ కీప‌ర్ల‌ జాబితాలో మ‌హేంద్ర సింగ్ ధోనీ తర్వాత రెండవ స్థానంలో దినేశ్ కార్తీక్‌ ఉన్నాడు.


More Telugu News