‘ఫేక్ ప్రచారం’ కట్టడికి ఐరాస విలువైన సూచన

  • సోషల్ మీడియాలో షేర్ చేసే ముందు జాగ్రత్తలు
  • ఐదు ప్రశ్నలు వేసుకున్నాకే షేర్ చేయాలన్న ఐరాస
  • విద్వేషం, ఆందోళనల కట్టడికి ఇదే మంచి మార్గమని వివరణ
సోషల్ మీడియా వాడకం విస్తృతంగా పెరిగిన ఈ రోజుల్లో ఫేక్ వార్తల కట్టడి సవాల్ గా మారిందని ఐక్యరాజ్య సమితి (ఐరాస) పేర్కొంది. జూన్ 30న ప్రపంచ సామాజిక మాధ్యమాల దినోత్సవం సందర్భంగా సోషల్ మీడియా యూజర్లకు విలువైన సూచనలు చేసింది. తప్పుడు సమాచారం వ్యాప్తి వల్ల విద్వేషం, ఆందోళనలు చెలరేగే ముప్పు ఉందని గుర్తుచేసింది. దీనిని అరికట్టేందుకు ఎవరికి వారే పలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. సామాజిక మాధ్యమాలలో ఏదైనా సమాచారాన్ని ఇతరులకు షేర్ చేసే ముందు ఐదు ప్రశ్నలు వేసుకోవాలని, వాటికి సంతృప్తికరమైన జవాబు లభిస్తేనే షేర్ చేయాలని సలహా ఇచ్చింది. అవేంటంటే..

  • మీకు అందిన సమాచారాన్ని రూపొందించింది ఎవరు?
  • అది తాజా సమాచారమేనా?
  • ఆ సమాచారానికి మూలం ఏమిటి?
  • దానిని మీకు పంపించింది ఎవరు?
  • మీకు అందిన సమాచారాన్ని ఇతరులతో పంచుకోవడానికి కారణమేంటి?
ఈ జాగ్రత్తలు తీసుకుంటే సోషల్ మీడియాలో ఫేక్ ప్రచారానికి అడ్డుకట్ట వేయొచ్చని ఐరాస పేర్కొంది.


More Telugu News