బీహార్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలి.. కేంద్ర మంత్రి చిరాగ్ పాశ్వాన్

  • బీహారీలు తమ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఎప్పటి నుంచో కోరుకుంటున్నారన్న పాశ్వాన్
  • ప్రత్యేక రాష్ట్రం డిమాండ్‌ను ప్రధాని ముందుంచుతామన్న కేంద్ర మంత్రి
  • ఎన్డీయే భాగస్వాములుగా తాము తప్ప ప్రత్యేక హోదాను ఎవరడుగుతారని కామెంట్
  • ఇదేమీ ఒత్తిడి రాజకీయాలు కావని స్పష్టీకరణ
బీహార్‌కు ప్రత్యేక హోదా డిమాండ్‌ను ప్రధాని నరేంద్ర మోదీ ముందు పెడతామని కేంద్ర మంత్రి చిరాగ్ పాశ్వాన్ ఆదివారం అన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదాను బీహారీలు ఎంతోకాలంగా కోరుకుంటున్నారని అన్నారు. ‘‘ఇదేమీ రాజకీయ ఒత్తిడి కాదు. బీహార్‌కు స్పెషల్ స్టేటస్ కావాలని ఎప్పటి నుంచో అడుగుతున్నాం. బీహార్‌లో ఏ పార్టీ అయినా ఇదే కోరుకుంటోంది. మేమూ ఇందుకు సానుకూలంగానే ఉన్నాం. మేము ఎన్డీయేలో భాగస్వాములం. కూటమిలో బీజేపీ అతిపెద్ద పార్టీ. నరేంద్ర మోదీ మా నేత. మా అందరికీ ఆయనపై నమ్మకం ఉంది. ప్రత్యేక హోదా గురించి మేము అడగకపోతే ఇంకెవరు అడుగుతారు?’’ అని పాశ్వాన్ మీడియాతో అన్నారు. బీహారీలు ఎంతోకాలంగా కోరుతున్న ప్రత్యేక హోదా రాష్ట్రానికి దక్కుతుందనే ఆశతో ఉన్నామని పాశ్వాన్ అన్నారు. ఇందుకు సంబంధించి ఏయే నిబంధనల్లో మార్పు చేయాలో చర్చిస్తామని తెలిపారు. 

ప్రస్తుత నిబంధనల ప్రకారం, రాష్ట్రాలకు ప్రత్యేక హోదా అంటూ ఏదీ లేదు. 13వ ప్రణాళికా సంఘం గడువు 2014 ఆగస్టులో ముగిసింది. ఆ తరువాత 15వ ప్రణాళికా సంఘం సాధారణ, ప్రత్యేక హోదా రాష్ట్రాల నిర్వచనం ఏదీ ఇవ్వలేదు. అయితే, తాజాగా ప్రణాళిక సంఘం సూచనల మేరకు కేంద్ర ప్రభుత్వం పన్నుల్లో మరింత మొత్తాన్ని రాష్ట్రాలకు బదిలీ చేయడం ప్రారంభించింది. పన్నుల్లో రాష్ట్ర వాటాను 32 శాతం నుంచి 42కు పెంచింది. అంతేకాకుండా, ఆదాయ లోటు, వనరుల కొరతతో సతమతమవుతున్న రాష్ట్రాలకు అదనపు నిధులు బదిలీ చేయాలన్న ప్రణాళికా సంఘం సూచనను కూడా కేంద్రం ఆమోదించింది. కొత్త నిబంధనల ప్రకారం, 2015-16 సంవత్సరంలో రాష్ట్రాలకు రూ. 5.26 లక్షల కోట్ల నిధులను కేంద్రం బదిలీ చేసింది. అంతకుముందు ఏడాదితో పోలిస్తే ఇది రూ.1.78 లక్షల కోట్లు అదనం. 

తెలుగు రాష్ట్రాల విభజన తరువాత ఏపీలో ప్రత్యేక హోదా డిమాండ్ ఊపందుకున్న విషయం తెలిసిందే. అయితే, ఏపీ బీహార్‌తో పాటు ఒడిశా, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్ రాష్ట్రాలు కూడా తమకు ప్రత్యేక హోదా ఇవ్వాలని పట్టుబడుతున్నాయి. అయితే, ఆదాయం లోటు ఉన్న రాష్ట్రాలకు ఆర్థిక ప్యాకేజీ ఇచ్చేందుకు కేంద్రం ఇప్పటికే సుముఖత వ్యక్తం చేసింది. ఈ పథకం కింద ఏపీ, బీహార్‌లకు అదనపు గ్రాంట్లు వచ్చే అవకాశం ఉంది.


More Telugu News