గ్రామ స్థాయి నుంచి ఉప రాష్ట్రపతి వరకు.. వెంకయ్య నాయుడు జీవిత ప్రస్థానం అద్వితీయం: మోదీ

  • ఆయన వాగ్ధాటి అమోఘమని కొనియాడిన ప్రధాని
  • వెంకయ్యనాయుడిపై మూడు పుస్తకాలను వర్చువల్ గా ఆవిష్కరించిన మోదీ
  • గచ్చిబౌలిలోని కన్వెన్షన్ సెంటర్ లో కార్యక్రమం
  • వర్చువల్ గా హాజరైన ప్రధాని నరేంద్ర మోదీ
గ్రామ స్థాయి నుంచి ఉప రాష్ట్రపతిగా ఎదిగిన గొప్ప వ్యక్తి వెంకయ్య నాయుడు అని, ఆయన జీవిత ప్రస్థానం స్ఫూర్తిదాయకమని ప్రధాని నరేంద్ర మోదీ కొనియాడారు. మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు పుట్టిన రోజు సందర్భంగా ఆయనపై రూపొందించిన మూడు పుస్తకాలను మోదీ వర్చువల్ గా ఆవిష్కరించారు. ఆదివారం గచ్చిబౌలిలోని అన్వయ కన్వెన్షన్ సెంటర్ లో పుస్తకావిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రధాని మోదీ వర్చువల్ గా పాల్గొన్నారు. ‘సేవలో వెంకయ్యనాయుడు జీవితం’, ‘13వ ఉపరాష్ట్రపతిగా వెంకయ్యనాయుడు లక్ష్యం, సందేశం’, ‘మహానేత వెంకయ్యనాయుడు జీవితం, ప్రయాణం’ అనే పుస్తకాలను మోదీ విడుదల చేశారు.

అనంతరం మోదీ మాట్లాడుతూ.. ఈ పుస్తకాలు ప్రజలకు ప్రేరణగా నిలుస్తాయని, మార్గనిర్దేశం చేస్తాయని చెప్పారు. వెంకయ్య నాయుడుతో తాను సుదీర్ఘకాలం కలిసి పనిచేసే అవకాశం తనకు దక్కిందని మోదీ చెప్పారు. వేలాది కార్యకర్తలు ఆయన నుంచి ఎంతో నేర్చుకున్నారని తెలిపారు. ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పోరాడి 17 నెలల పాటు జైలులో ఉన్నారని గుర్తుచేశారు. స్వచ్ఛభారత్‌, అమృత్‌ యోజన వంటి పథకాలను సమర్థవంతంగా అమలు చేసి కేంద్ర మంత్రిగా గ్రామీణ పట్టణాభివృద్ధి శాఖలో ఆయన తనదైన ముద్ర వేశారని చెప్పారు. ఆర్టికల్ 370 రద్దు బిల్లు తొలుత రాజ్యసభకే వెళ్లిందని, అప్పుడు చైర్మన్ గా ఉన్న వెంకయ్య నాయుడు సభను సజావుగా నడిపించి బిల్లు ఆమోదం పొందడానికి కీలకంగా వ్యవహరించారని గుర్తుచేశారు. ఆయన వాగ్ధాటి ముందు ఎవరూ నిలవలేరని చెప్పారు. ఆయన దీర్ఘకాలం ఆరోగ్యంగా ఉండి మార్గనిర్దేశం చేయాలని ప్రధాని మోదీ ఆకాంక్షించారు.

కేంద్రం మాతృభాషలను ప్రోత్సహించడం గొప్ప విషయం: వెంకయ్యనాయుడు

కేంద్ర ప్రభుత్వం మాతృభాషలను ప్రోత్సహించడం గొప్ప విషయమని వెంకయ్య నాయుడు చెప్పారు. తాను ఆంగ్ల భాషకు వ్యతిరేకం కాదన్నారు. అయితే, మాతృభాష, సోదర భాష తర్వాతే ఇతర భాషలకు ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు. పుస్తకావిష్కరణ సభలో ఆయన మాట్లాడుతూ.. రిఫార్మ్‌, పర్‌ఫార్మ్‌, ట్రాన్స్‌ఫార్మ్‌ నినాదంతో ప్రధాని మోదీ ముందుకెళ్తున్నారని తెలిపారు. చట్ట సభలకు ఎన్నికైన నేతలు హుందాగా వ్యవహరించాలని, పార్టీ మారడం తప్పు కాదు.. కానీ పార్టీ ద్వారా పొందిన పదవులను త్యజించాకే మరో పార్టీలోకి వెళ్లాలని సూచించారు. రాజకీయాల్లో జవాబుదారీతనం తీసుకురావడానికి ప్రయత్నించాలని కోరారు. కులం, డబ్బు కాకుండా గుణం చూసి నాయకులకు ఓటు వేయాలని వెంకయ్య నాయుడు ప్రజలకు పిలుపునిచ్చారు.


More Telugu News