వారెన్ బఫెట్ సంచలన నిర్ణయం.. ‘ఆస్తి వీలునామా’ను సవరించిన సంపన్నుడు

  • మరణానంతరం తన ఆస్తి మొత్తం పిల్లలు నిర్వహిస్తున్న ట్రస్టులకే దక్కుతుందని వీలునామా
  • బిల్ అండ్ మిలిందా గేట్స్ ఫౌండేషన్‌కు విరాళంగా గతంలో ప్రకటన
  • గత వీలునామాను సవరించిన ప్రపంచ ధనికుడు
ప్రపంచ ప్రఖ్యాత ఇన్వెస్టర్, ప్రపంచ ధనికుల్లో ఒకరైన ‘బెర్క్‌షైర్ హాత్‌వే’ ఛైర్మన్ వారెన్ బఫెట్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన మరణానంతర ఆస్తి మొత్తం తన ముగ్గురు పిల్లలు కొత్తగా నిర్వహిస్తున్న ఛారిటబుల్ ట్రస్ట్‌కే చెందుతుందని ప్రకటించారు. బిల్ అండ్ మిలిందా గేట్స్ ఫౌండేషన్‌కు విరాళాలుగా అందించనున్నట్టు గతంలో రాసిన వీలునామాను ఆయన మరోసారి సవరించారు. తన మరణం తర్వాత తన సంపదకు సంబంధించిన ప్రణాళికలను మార్చుకున్నానని తెలిపారు.

తన పిల్లల నైతిక విలువలు, సంపదను సముచితంగా పంపిణీ చేయగలరనే విశ్వాసంతో తాజాగా తన నిర్ణయాన్ని మార్చుకున్నానని వివరించారు. తన పిల్లలు మంచిగా పనిచేస్తారని 100 శాతం నమ్మకం కుదిరిందని అన్నారు. ఈ మేరకు ‘వాల్ స్ట్రీట్ జర్నల్’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన స్పష్టం చేశారు. కాగా ప్రస్తుతం93 ఏళ్ల వయసున్న వారెన్ బఫెట్ ఇప్పటికే పలుమార్లు వీలునామాను మార్చారు. అయితే తను బతికున్నంత కాలం గేట్స్ అండ్ మిలిందా ఫౌండేషన్‌కు విరాళాలు అందుతూనే ఉంటాయని బఫెట్ స్పష్టం చేశారు.

కాగా మరణానంతరం తన సంపదలో 99 శాతం వాటా ‘బిల్ అండ్ మెలిందా గేట్స్ ఫౌండేషన్‌’కు విరాళంగా దక్కుతుందని గతంలో బఫెట్ ప్రకటించారు. ఇక వారెన్ బఫెట్ పిల్లలు ముగ్గురికీ ఛారిటబుల్ ట్రస్టులు ఉన్నాయి. మొత్తం నాలుగు స్వచ్ఛంద సేవా సంస్థలను నిర్వహిస్తున్నారు. సుసాన్ థాంప్సన్ బఫెట్ ఫౌండేషన్, షేర్‌వుడ్ ఫౌండేషన్, హోవార్డ్ జి. బఫెట్ ఫౌండేషన్, నోవో ఫౌండేషన్ అనే పేర్లతో వీటిని నిర్వహిస్తున్నారు. కాగా బెర్క్ షైర్ హాత్‌వే కంపెనీలో 13 మిలియన్ల క్లాస్-బీ షేర్లను పిల్లల ట్రస్టులకు రాశారు. ఇక సుమారు 9.3 మిలియన్ షేర్లను బిల్ అండ్ మిలిందా గేట్స్ ఫౌండేషన్ ట్రస్ట్‌కు కేటాయించినట్టు కంపెనీ శుక్రవారం ప్రకటన విడుదల చేసింది.


More Telugu News