సూర్య పట్టిన క్యాచ్‌పై వెలుగులోకి కొత్త వీడియో.. అది సిక్సర్ అంటున్న దక్షిణాఫ్రికా ఫ్యాన్స్.. వీడియో ఇదిగో

  • సూర్య పట్టింది క్యాచ్ కాదు.. సిక్సర్ అంటూ వెలుగులోకి తాజా వీడియో
  • సూర్య కాలు బౌండరీ రోప్‌ను తాకిందంటున్న దక్షిణాఫ్రికా ఫ్యాన్స్
  • ఒకటికి రెండు సార్లు చెక్ చేసి ఉంటే బావుండేదంటున్న సౌతాఫ్రికా క్రికెట్ అభిమానులు
టీ20 ప్రపంచ కప్ 2024 ఫైనల్ మ్యాచ్ అత్యంత ఉత్కంఠభరితంగా సాగింది. ఇరు జట్లు హోరాహోరీగా తలపడ్డాయి. టీమిండియా చారిత్రక విజయాన్ని సాధించిన ఈ మ్యాచ్‌లో చివరి ఓవర్‌ తొలి బంతికి సూర్యకుమార్ యాదవ్ బౌండరీ లైన్ వద్ద సూపర్ మ్యాన్‌లా పట్టిన క్యాచ్ టర్నింగ్ పాయింట్‌గా మారింది. క్రీజులో పాతుకుపోయిన సౌతాఫ్రికా స్టార్ ప్లేయర్, డేంజరస్ ప్లేయర్ డేవిడ్ మిల్లర్ ఔట్ కావడంతో భారత్ పుంజుకొని చిరస్మరణీయ విజయాన్ని సాధించింది.

అయితే బౌండర్ రోప్ వద్ద సూర్యకుమార్ యాదవ్ పట్టిన అద్భుతమైన క్యాచ్‌కు సంబంధించి సోషల్ మీడియా వేదికగా తాజా వీడియో ఒకటి వైరల్‌గా మారింది. బాగా జూమ్ చేసి ఉన్న ఈ వీడియోలో సూర్యకుమార్ యాదవ్ కాలు బౌండరీ రోప్‌ను తాకిందని దక్షిణాఫ్రికా అభిమానులు అభిప్రాయపడుతున్నారు. ఔట్‌ అని నిర్ధారించడానికి ముందు థర్డ్ అంపైర్లు మరింత జాగ్రత్తగా చెక్ చేసి ఉండాల్సిందని అంటున్నారు.

అది ఔట్ కాదు.. సిక్సర్ అంటూ ఈ వీడియో చక్కర్లు కొడుతోంది. భారత్ కేవలం 7 పరుగుల తేడాతో గెలిచిందని, దీనిని సిక్స్‌గా పరిగణనలోకి తీసుకొని ఉంటే మ్యాచ్ ఫలితం మారిపోయేదేమోనని వ్యాఖ్యానిస్తున్నారు. ఇలాంటి అంశాలు మ్యాచ్ ఫలితాలను మార్చివేస్తాయని చెబుతున్నారు. కాగా సూర్య కుమార్ యాదవ్ అందుకున్న క్యాచ్‌ను పలు కోణాల్లో పరిశీలించిన అనంతరమే థర్డ్ అంపైర్లు.. డేవిడ్ మిల్లర్ ఔట్ అయినట్టుగా ప్రకటించారు. ఈ నిర్ణయం భారత జట్టుకు అనుకూలంగా మారిన విషయం తెలిసిందే. ఇక సూర్య అద్భుత క్యాచ్‌పై భారత ఫీల్డింగ్ కోచ్ టీ దిలీప్ స్పందిస్తూ... సూర్య ఇలాంటి 50 క్యాచ్‌లు ప్రాక్టీస్ చేశాడని వెల్లడించారు. బౌండరీ రోప్‌పై సూర్యకు అవగాహన ఉందని, బంతిని అందుకున్నాక తిరిగి మైదానంలోకి విసిరి దానిని పట్టుకోగలననే విశ్వాసం గల ఆటగాడు సూర్య అని కితాబిచ్చాడు.


More Telugu News