అమరావతిలో ప్రభుత్వ భవనాలను నోటిఫై చేస్తూ గెజిట్ జారీ

  • రాజధాని మాస్టర్ ప్లాన్ ప్రకారం అమరావతిలో ప్రభుత్వ భవనాల కాంప్లెక్స్ ల నిర్మాణం
  • 1,575 ఎకరాల భూమిని నోటిఫై చేసిన సీఆర్డీఏ
  • అమరావతి నిర్మాణంలో కీలక ముందడుగు
ఏపీ రాజధాని అమరావతి ప్రాంతంలో నిర్మిస్తున్న ప్రభుత్వ భవనాల కాంప్లెక్స్ లను నోటిఫై చేస్తూ నేడు గెజిట్ జారీ చేశారు. తద్వారా అమరావతి నిర్మాణంలో కీలక ముందడుగు పడినట్టయింది. రాజధాని మాస్టర్ ప్లాన్ ప్రకారం అమరావతిలో ప్రభుత్వ భవనాల సముదాయాలను నిర్మిస్తున్నారు. ఆ మేరకు ప్రభుత్వ భవనాలు నిర్మాణం జరుపుకుంటున్న 1,575 ఎకరాల ప్రాంతాన్ని సీఆర్డీఏ నోటిఫై చేసింది. 

తాజాగా, సీఆర్డీఏ చట్టం సెక్షన్-39 ప్రకారం గెజిట్ జారీ చేస్తూ బహిరంగ ప్రకటన విడుదల చేసింది. దీనిపై సీఆర్డీఏ కమిషనర్ కాటమనేని భాస్కర్ స్పందిస్తూ... మాస్టర్ ప్లాన్ లోని జోనింగ్ నిబంధనలను అనుసరించి నేలపాడు, లింగాయపాలెం, రాయపూడి, కొండమరాజు పాలెం, శాఖమూరు సరిహద్దుల్లో ఉన్న ప్రాంతాన్ని నోటిఫై చేసినట్టు తెలిపారు. 

కాగా, ఈ భూముల్లో పూర్తి స్థాయి అసెంబ్లీ, సచివాలయం, హైకోర్టు, మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారుల నివాస సముదాయాలు నిర్మించే అవకాశాలున్నట్టు తెలుస్తోంది. 

ఇటీవలే సీఎంగా బాధ్యతలు చేపట్టిన అనంతరం చంద్రబాబు రాజధాని ప్రాంతంలో పర్యటించి, పనులు ఎక్కడెక్కడ ఆగిపోయాయో పరిశీలించారు. ఆ మేరకు యాక్షన్ ప్లాన్ రూపొందించి అమరావతి నిర్మాణాన్ని పరుగులు పెట్టించాలని సీఎం చంద్రబాబు కృతనిశ్చయంతో ఉన్నారు.


More Telugu News