జస్టిస్ నర్సింహారెడ్డికి మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి లేఖ

  • నిబంధనలకు లోబడి ఛత్తీస్‌గఢ్ నుంచి విద్యుత్ కొనుగోలు చేసినట్లు వెల్లడి
  • తెలంగాణ అభివృద్ధికి ఇది దోహదపడిందని వెల్లడి
  • ఒక అంశంపై విచారిస్తే అందరినీ విచారించాలన్న జగదీశ్ రెడ్డి
విద్యుత్ కొనుగోళ్లపై విచారణ జరుపుతున్న జస్టిస్ నర్సింహారెడ్డి కమిషన్‌కు తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి శనివారం లేఖ రాశారు. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలో విద్యుత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంతో నాటి రాష్ట్ర ప్రభుత్వం అవగాహన ఒప్పందం కుదుర్చుకుందని తెలిపారు. 2003లో కేంద్ర ప్రభుత్వ విద్యుత్ చట్టం ప్రకారం పీజీసీఐఎల్ నిబంధనలకు లోబడి ఒప్పందాలు జరిగినట్లు తెలిపారు. తెలంగాణ అభివృద్ధికి ఇది దోహదపడిందే కానీ నష్టం జరగలేదని వివరించారు.

నాడు ఉన్న చట్టాలకు, నిబంధనలకు లోబడే భద్రాద్రి విద్యుత్ కేంద్రాన్ని సబ్ క్రిటికల్ టెక్నాలజీతో నిర్మించినట్లు తెలిపారు. అతి తక్కువ కాలంలో నిర్మాణం పూర్తి చేస్తామని బీహెచ్ఈఎల్ ముందుకు రావడంతో కొత్తగూడెంలో 800 మెగావాట్ల ప్రాజెక్టు, మణుగూరులో నాలుగు 270 మెగావాట్ల ప్రాజెక్టుల నిర్మాణం ఆ సంస్థకు అప్పగించినట్లు చెప్పారు. రైతులకు 24 గంటల విద్యుత్, పెరుగుతున్న విద్యుత్ డిమాండ్‌కు అనుగుణంగా నల్గొండ జిల్లా దామరచర్లలో 4 వేల మెగావాట్ల అల్ట్రా మెగా పవర్ ప్లాంట్ నిర్మాణానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.

ఒక అంశంపై విచారణ జరిగినప్పుడు ఒప్పందాల్లో భాగస్వాములైన వారందరినీ విచారించాలన్నారు. కానీ కొంతమందిని మాత్రమే విచారించి మీడియా సమావేశంలో మాట్లాడటం బాధాకరమన్నారు. ఇలా చేయడం ద్వారా, తమ రాజకీయ ప్రత్యర్థులు కక్షపూరితంగా చేసిన నిరాధార, అర్థరహిత ఆరోపణలకు ఊతమిచ్చినట్లే అవుతుందన్నారు.


More Telugu News