మాజీ ఎంపీ రమేశ్ రాథోడ్ మృతి పట్ల ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ తీవ్ర దిగ్భ్రాంతి

  • గుండెపోటుతో మరణించిన రమేశ్ రాథోడ్
  • స్పందించిన చంద్రబాబు, లోకేశ్
  • ఖానాపూర్ ఎమ్మెల్యేగా విశేష సేవలందించారన్న చంద్రబాబు
  • టీడీపీతో రమేశ్ రాథోడ్ కు విడదీయరాని బంధం ఉందన్న నారా లోకేశ్
బీజేపీ నేత, ఆదిలాబాద్ మాజీ ఎంపీ రమేశ్ రాథోడ్ హఠాన్మరణం చెందడం తెలిసిందే. గుండెపోటుతో ఆయన కన్నుమూశారు. రమేశ్ రాథోడ్ మృతిపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు...  ఏపీ మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ స్పందించారు.

మాజీ ఎంపీ రమేశ్ రాథోడ్ అకాల మరణం వార్త తెలిసి తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యానని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. టీడీపీ నుంచి ఆదిలాబాద్ ఎంపీగా, జడ్పీ చైర్మన్ గా, ఖానాపూర్ ఎమ్మెల్యేగా ఆయన విశేష సేవలు అందించారని చంద్రబాబు గుర్తుచేసుకున్నారు. గిరిజన ప్రాంతాల అభివృద్ధికి ఎంతో కృషి చేసిన ఆయన మరణం తీరని లోటు అని పేర్కొన్నారు. ఈ విషాద సమయంలో వారి కుటుంబ సభ్యులకు బాధాతప్త హృదయంతో ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని చంద్రబాబు వెల్లడించారు. 

ఇక, రమేశ్ రాథోడ్ హఠాన్మరణంతో తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యానని నారా లోకేశ్ తెలిపారు. ఆయన మృతి పట్ల సంతాపం తెలియజేస్తూ, నివాళులు అర్పిస్తున్నానని వివరించారు. టీడీపీతో ఆయనకు విడదీయరాని అనుబంధం ఉందని, ఈ విషాద సమయంలో రమేశ్ రాథోడ్ గారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని లోకేశ్ పేర్కొన్నారు. 

రమేశ్ రాథోడ్ రాజకీయ ప్రయాణం టీడీపీతోనే మొదలైంది. మొదట జడ్పీటీసీగా ప్రస్థానం ప్రారంభించిన రాథోడ్... ఆ తర్వాత 1999 నుంచి 2004 వరకు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన ఖానాపూర్ అసెంబ్లీ స్థానం నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత 2009లో ఆదిలాబాద్ ఎంపీగానూ విజయం సాధించారు. అంతకుముందు, ఆదిలాబాద్ జడ్పీ చైర్మన్ గానూ వ్యవహరించారు.

తెలంగాణ ఉద్యమ సమయంలో టీడీపీ నుంచి బయటికి వచ్చి బీఆర్ఎస్ లో చేరారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరిన ఆయన... కొన్నాళ్లకే రాజీనామా చేసి బీజేపీలో చేరారు. గత సంవత్సరం జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన ఖానాపూర్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయారు.


More Telugu News