నూతన శిక్షాస్మృతుల అమలు వాయిదా వేయండి: కేంద్రానికి లేఖ రాసిన పీయూసీఎల్

  • భారతదేశంలో జులై 1 తర్వాత కొత్త న్యాయ చట్టాలు
  • ఐపీసీ తదితర పాత శిక్షాస్మృతులకు వీడ్కోలు
  • అయితే కొత్త చట్టాలపై జాతీయ స్థాయిలో విస్తృత చర్చ జరగాలన్న పీయూసీఎల్
భారతదేశంలో బ్రిటీష్ కాలం నాటి ఐపీసీ శిక్షాస్మృతిని తొలగించి, నూతన క్రిమినల్ చట్టాలను తీసుకురావాలని కేంద్రం సన్నద్ధమవుతున్న సంగతి తెలిసిందే. జులై 1 తర్వాత దేశంలో కొత్త చట్టాలు అమలు కానున్నాయి. 

ఇప్పటివరకు ఉన్న ఇండియన్ పీనల్ కోడ్ (ఐపీసీ), కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ల స్థానంలో భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్), భారతీయ నాగరిక్ సురక్ష (బీఎన్ఎస్ఎస్), భారతీయ సాక్ష్య అధినియమ్ (బీఎస్ఏ) అమలు కానున్నాయి. 

అయితే, నూతన క్రిమినల్ చట్టాల అమలును వాయిదా వేయాలని పీయూసీఎల్ (పీపుల్స్ యూనియన్ ఫర్ సివిల్ లిబర్టీస్) కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ కు లేఖ రాసింది. కొత్త చట్టాల తీరుతెన్నులు, కొత్త చట్టాల అసవరం, కొత్త చట్టాలు ప్రవేశపెట్టడానికి గల అవకాశాలు తదితర అంశాలపై ముందు జాతీయ స్థాయిలో చర్చ జరగాలని పీయూసీఎల్ తన లేఖలో పేర్కొంది. 

ఎంతో విస్తృతంగా చర్చించి ఈ చట్టాలను తీసుకువచ్చామని, సభలో చర్చల సందర్భంగా అనేకమంది విపక్ష ఎంపీలను సస్పెండ్ చేశామని న్యాయ శాఖ మంత్రి ఇటీవల చెప్పారని... అయితే, విపక్ష ఎంపీలను సస్పెండ్ చేయడం ఆ చట్టాలపై వివరణాత్మక చర్చ జరగలేదన్న విషయాన్ని ఎత్తిచూపుతోందని పీయూసీఎల్ తన లేఖలో ప్రస్తావించింది. పైగా, క్రిమినల్ న్యాయవాదులు, న్యాయ వ్యవస్థలు, న్యాయాధికారులు, సాధారణ పౌరుల నుంచి అభిప్రాయాలను స్వీకరించలేదన్న విషయం కూడా అర్థమవుతోందని పేర్కొంది.


More Telugu News