రేషన్ మాఫియాపై సీఐడీ విచారణ: ఏపీ మంత్రి నాదెండ్ల

  • కాకినాడ అడ్డాగా గత ప్రభుత్వంలో కొనసాగిన దోపిడీ
  • పోర్టు నుంచి విదేశాలకు ఎగుమతి చేశారని ఆరోపణ
  • వేల కోట్లు పోగేసుకున్నారని మండిపడ్డ మంత్రి
ఆంధ్రప్రదేశ్ లో కాకినాడ అడ్డగా రేషన్ మాఫియా విచ్చలవిడిగా దోపిడీకి పాల్పడిందని పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఆరోపించారు. గత ప్రభుత్వ హయాంలో కాకినాడ పోర్టు నుంచి రేషన్ బియ్యం విదేశాలకు ఎగుమతి చేసి వేల కోట్లు ఆర్జించారని మండిపడ్డారు. పౌరసరఫరాల శాఖ ఉన్నతాధికారులతో మంత్రి రెండో రోజు శనివారం కూడా సమీక్ష జరిపారు. గత ప్రభుత్వ హయాంలో దోపిడీకి కొంతమంది అధికారులు కూడా సహకరించారని విమర్శించారు. రేషన్ అక్రమాలపై సీఐడీ విచారణ కోరతామని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి స్పష్టం చేశారు. కాకినాడలో 7615 మెట్రిక్‌ టన్నుల రేషన్‌ బియ్యం సీజ్‌ చేసినట్లు చెప్పారు. కాకినాడ పోర్టు నుంచి ఇతర దేశాలకు రేషన్‌ సరకులు వెళ్తున్నాయని చెప్పారు.

మంత్రి పర్యటన ఉందని తెలిసి 4 రోజులుగా అక్రమ బియ్యం తరలించారని చెప్పారు. అంతకుముందు శుక్రవారం కలెక్టర్ కార్యాలయంలో పౌరసరఫరాల శాఖ అధికారులతో మంత్రి సమీక్ష జరిపి, గత వైసీపీ ప్రభుత్వంపై ఆరోపణలు చేశారు. ‘పౌరసరఫరాల కార్పొరేషన్‌ ద్వారా గత ప్రభుత్వం రూ.36,300 కోట్లు అప్పు చేసింది. రైతులకు రూ.1,600 కోట్ల బకాయిలు చెల్లించకుండా వెళ్లిపోయింది. ధాన్యం కొనుగోలు ప్రక్రియపై త్వరలోనే విధానపరమైన నిర్ణయం తీసుకుంటాం. కౌలు రైతులకు మేలు చేస్తాం’ అని మంత్రి నాదెండ్ల మనోహర్‌ హామీ ఇచ్చారు.


More Telugu News